Uttam Kumar Reddy: ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే, ఆయన హెలికాప్టర్ ద్వారా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టన్నెల్ కూలిపోయిన ప్రదేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉదయం 8 గంటలకు కార్మికులు సొరంగంలోకి ప్రవేశించారని, 8.30 గంటలకు బోరింగ్ మెషీన్ ప్రారంభించారని మంత్రి వెల్లడించారు. 20 మీటర్లు డ్రిల్లింగ్ చేసిన వెంటనే టన్నెల్‌లోకి నీరు లీక్ కావడం ప్రారంభమైందని, దీంతో మట్టి కుంగిపోయిందని తెలిపారు.
బోరింగ్ మెషీన్ ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే గుర్తించి వెంటనే వెనుక ఉన్న 42 మంది కార్మికులను బయటికి పంపించారని చెప్పారు. అయితే, బోరింగ్ మెషీన్ ముందుభాగంలో ఉన్న 8 మంది టన్నెల్‌లోనే చిక్కుకుపోయారని వెల్లడించారు. వారిలో ఇద్దరు విదేశీ ఇంజినీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. విదేశీ ఇంజినీర్లను మినహాయించి మిగిలిన వారంతా ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించినట్లు తెలిపారు.
టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అయితే, వారు 14 కిలోమీటర్ల లోపల ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయని చెప్పారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అనుభవం ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనాస్థలానికి రప్పించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.