Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డుల జారీ ఒక నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందవద్దని సూచించారు. రాష్ట్రంలోని అర్హులందరికీ కార్డులు ఇచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
కులగణన, సామాజిక, ఆర్థిక సర్వే వివరాలు, అలాగే పాత రేషన్ కార్డుల సమాచారం ఆధారంగా అర్హుల పేర్లను జాబితాలో నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. అర్హులైనవారికి రేషన్ కార్డులు రాకపోతే, వారు గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ నిరభ్యంతరంగా రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.