Delhi: గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో ఎనిమిది రోజుల పాటు ఉదయం 10:20 గంటల నుంచి 12:45 గంటల వరకు విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (డీఐఏఎల్) ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 26 వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుందని డీఐఏఎల్ శనివారం వెల్లడించింది.
దేశంలోనే అత్యంత బిజీగా ఉండే విమానాశ్రయంగా పేరుగాంచిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) నుంచి రోజూ 1300 విమానాలు నడుస్తాయి. నిషేధం కారణంగా షెడ్యూల్డ్ విమానాల నిర్వహణపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇంకా స్పష్టత రాలేదు.
డీఐఏఎల్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా, “రిపబ్లిక్ డే వారంలో జనవరి 19 నుంచి 26 వరకు ప్రతి రోజూ ఉదయం 10:25 గంటల నుంచి 12:45 గంటల వరకు విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నాం” అని ప్రకటించింది. ప్రయాణికులు తమ విమాన సర్వీసుల వివరాలు సంబంధిత విమానయాన సంస్థలతో సంప్రదించి నిర్ధారించుకోవాలని సూచించింది.