US Nuclear Emergency

US Nuclear Emergency: అమెరికా అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం..!

US Nuclear Emergency: అమెరికాలోని ప్రముఖ అణు పరిశోధనా కేంద్రంలో సంభవించిన అగ్నిప్రమాదం ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దక్షిణ కరోలినా రాష్ట్రంలోని ప్రఖ్యాత ‘సవన్నా రివర్ నేషనల్ లేబరేటరీ’ (SRNL) ప్రాంగణంలో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. న్యూక్లియర్ కాంప్లెక్స్ కావడం, రేడియోధార్మిక పదార్థాలు ఉండే ప్రదేశం కావడంతో.. ప్రమాద తీవ్రతను పసిగట్టిన అధికారులు వెంటనే అప్రమత్తమై ‘సైట్ ఏరియా ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. అయితే ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో పాటు ఎలాంటి రేడియేషన్ లీకేజీ జరగలేదని నిర్ధారించడంతో పెను ముప్పు తప్పింది.

క్షణాల్లో హై అలర్ట్.. రోడ్లు, రైళ్లు, విమానాలపై ఆంక్షలు!

అగ్నిప్రమాదం వెలుగుచూసిన వెంటనే అత్యవసర విభాగం యుద్ధప్రాతిపదికన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాంగణంలోకి వచ్చే రహదారి ప్రవేశ మార్గాల (బారికేడ్ల) వద్ద ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు.ముందుజాగ్రత్త చర్యగా సమీప ప్రాంతంలో రైలు, విమాన మరియు నదీ రవాణాపై తాత్కాలిక ఆంక్షలు విధించారు (హైవే 125 మాత్రం అందుబాటులోనే ఉంది).

రెస్క్యూ లేదా ఎమర్జెన్సీ ఆపరేషన్లతో సంబంధం లేని మిగిలిన ఉద్యోగులందరినీ ఎక్కడికక్కడ ఇండోర్‌లోనే సురక్షిత ప్రదేశాల్లో (Shelter-in-place) ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకున్నారు.

మంటలు అదుపులోకి.. రాత్రి 9:45 గంటలకు ఎమర్జెన్సీ ఎత్తివేత

అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.అనంతరం నిపుణుల బృందాలు విస్తృతంగా రేడియోలాజికల్ సర్వేలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ల్యాబ్ లోపల గానీ, వెలుపల గానీ ఎలాంటి రేడియోధార్మిక కాలుష్యం (కంటామినేషన్) లేదని అధికారులు స్పష్టం చేశారు.

అంతా సురక్షితమని తేలడంతో బుధవారం రాత్రి 9:45 గంటలకు ఎమర్జెన్సీని అధికారికంగా ముగిస్తున్నట్లు ప్రకటించారు.రోడ్లపై ఆంక్షలను ఎత్తివేసి, మూసివేసిన బారికేడ్లను తిరిగి తెరిచారు. ఉద్యోగులంతా గురువారం యథావిధిగా తమ షెడ్యూల్ ప్రకారం విధులకు హాజరు కావచ్చని యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ఎవరైనా గాయపడ్డారా అనే అంశాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నిపుణుల విశ్లేషణ: భౌగోళిక దూరం రక్షించింది!

యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్ అణు విద్యుత్ భద్రతా విభాగం డైరెక్టర్ ఎడ్విన్ లైమన్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన ప్రాంగణం వెలుపల కాలుష్యం లేదని తేలడం చాలా ఊరటనిచ్చే విషయమన్నారు.

సాధారణంగా ఇలాంటి అణు పరిశోధనా కేంద్రాలు ప్రజల నివాస ప్రాంతాలకు చాలా దూరంగా ఉండటం వల్ల కూడా ప్రమాద తీవ్రత తగ్గడానికి సహాయపడుతుందని వివరించారు.రేడియోధార్మిక పదార్థాలు ఉన్న ప్రదేశాల్లో మంటలు గాలిలోకి వ్యాపిస్తే రేడియేషన్ ప్రభావం పడే ముప్పు ఉంటుందని, అందుకే అధికారులు చూపిన అప్రమత్తత అభినందనీయమని పేర్కొన్నారు.

కోల్డ్ వార్ హిస్టరీ: సవన్నా రివర్ సైట్ ప్రాధాన్యం ఏంటి?

దక్షిణ కరోలినాలోని ఐకెన్, బార్న్‌వెల్, అలెండేల్ కౌంటీల పరిధిలో దాదాపు 310 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఈ సవన్నా రివర్ సైట్ విస్తరించి ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) సమయంలో 1950ల ఆరంభంలో దీనిని స్థాపించారు. ఆ కాలంలో అమెరికా అణ్వాయుధ కార్యక్రమాలకు అవసరమైన ప్లూటోనియం-239, ట్రిటియం వంటి కీలక పదార్థాలను ఇక్కడే తయారు చేసేవారు.

ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి అణ్వాయుధాలు తయారు చేయడం లేదు. ఉపయోగించిన అణు ఇంధనాన్ని సురక్షితంగా నిర్వహించడం, రేడియోధార్మిక వ్యర్థాల నిర్మూలన, నిల్వ ఉన్న అదనపు ప్లూటోనియం నిర్వహణ, అణు నిరోధక సామర్థ్యానికి కావాల్సిన ట్రిటియం సంబంధిత శాస్త్రీయ కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *