డిపోల కోసం 185 ఎకరాల భూమి గుర్తింపు..
పాడ్ కార్ల మెయింటెనెన్స్, ఛార్జింగ్, పార్కింగ్ కోసం డిపోల ఏర్పాటు అత్యంత కీలకం. నెట్‌వర్క్‌కు అందుబాటులో ఉండేలా రెండు ప్రధాన కారిడార్లలో కలిపి దాదాపు 185 ఎకరాల భూమి అవసరమని లీ అసోసియేట్స్ గుర్తించింది.
కారిడార్-1 (ఐటీ హబ్)..
కూకట్పల్లి: ప్రాజెక్టు ఇక్కడి నుంచే మొదలవుతున్నందున భారీ డిపో కోసం 104.8 ఎకరాలు.
హైటెక్ సిటీ: రెండు ప్రాంతాల్లో కలిపి 32.5 ఎకరాలు (ఒకచోట 30.2 ఎకరాలు, మరోచోట 2.3 ఎకరాలు).
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్: మూడు లొకేషన్లలో కలిపి 43.2 ఎకరాలు (ఒకచోట 39.7 ఎకరాలు, మిగతా రెండు చోట్ల 3.5 ఎకరాలు).
కారిడార్-2 (హార్ట్ ఆఫ్ ది సిటీ)..
రాణిగంజ్ బస్ డిపో వద్ద 1.5 ఎకరాలు.
పీపుల్స్ ప్లాజా ఎదురుగా 0.9 ఎకరాలు.
బతుకమ్మ ఘాట్ పార్కింగ్ వద్ద 0.8 ఎకరాలు.
సంజీవయ్య పార్క్ సమీపంలో 0.7 ఎకరాలు.
ఈ ప్రతిపాదిత స్థలాలన్నీ ప్రభుత్వ సంస్థల యాజమాన్యంలోనే ఉండటంతో.. వాటిని ప్రాజెక్టు కోసం కేటాయించాలని కోరుతూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) త్వరలోనే సంబంధిత ప్రభుత్వ శాఖలకు అధికారిక లేఖలు రాయనుంది.
రూట్లు ఎక్కడెక్కడ? కనెక్ట్ అయ్యే మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు ఇవే!
ప్రయాణికులు మెట్రో లేదా ఎంఎంటీఎస్ దిగిన వెంటనే ఏమాత్రం నడవాల్సిన అవసరం లేకుండా నేరుగా పాడ్ కార్ ఎక్కేలా అలైన్‌మెంట్‌ను డిజైన్ చేశారు. దూరం తగ్గించేందుకు కొన్నిచోట్ల ఐటీ పార్కులు, ప్రభుత్వ భవనాల ప్రాంగణాల మీదుగానే ఈ ట్రాక్‌లు వెళ్తాయి.
మొదటి ప్రాంతం (ఐటీ కారిడార్ – 3 జోన్లు)
-
జోన్-1: కూకట్పల్లి నుంచి రాయదుర్గం (7.62 కిలోమీటర్లు).
-
జోన్-2: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ మీదుగా నాలెడ్జ్ సిటీ వరకు (12.83 కిలోమీటర్లు).
-
జోన్-3: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధి (14.01 కిలోమీటర్లు).
కీలక స్టేషన్లు: కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, దుర్గం చెరువు, రాయదుర్గం మెట్రో స్టేషన్లతో పాటు హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద టెర్మినల్స్ ఉంటాయి.
భవిష్యత్ విస్తరణ: రాబోయే మెట్రో ఫేజ్-2ను దృష్టిలో పెట్టుకుని నానక్‌రాంగూడ, విప్రో సర్కిల్, బయోడైవర్సిటీ, రాడిసన్ జంక్షన్ (ఇందిరానగర్), యూఎస్ కాన్సులేట్ ప్రాంతాల్లోనూ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.
రెండో ప్రాంతం (కోర్ సిటీ – 20 చదరపు కి.మీ. పరిధి):
సెక్రటేరియట్ (సచివాలయం), ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్ జంక్షన్, అసెంబ్లీ, బేగంపేట, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్లతో పాటు సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్ ఎంఎంటీఎస్ స్టేషన్లను కలుపుతూ రెండో నెట్వర్క్ రూపుదిద్దుకోనుంది.
రద్దీ ఎక్కువైతే ‘జీఆర్టీఎస్’.. ఒక్కో వెహికల్లో 25 మంది!
సాధారణంగా పీఆర్టీఎస్ పాడ్ కారులో నలుగురు నుంచి ఆరుగురు మాత్రమే కూర్చోవచ్చు. అయితే హైదరాబాద్ లాంటి హై-ట్రాఫిక్ నగరంలో మార్నింగ్, ఈవినింగ్ ఆఫీస్ రద్దీ సమయాల్లో ఈ చిన్న కార్లు సరిపోకపోవచ్చు. అందుకే నిపుణులు గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (GRTS) వాహనాలను ప్రతిపాదించారు. ఈ పెద్ద వాహనాల్లో ఒకేసారి 20 నుంచి 25 మంది హాయిగా ప్రయాణించవచ్చు.
పీక్ అవర్స్‌లో పెద్ద జీఆర్టీఎస్ కార్లను, సాధారణ సమయాల్లో చిన్న పాడ్ కార్లను నడపడం ద్వారా ట్రాఫిక్‌ను బ్యాలెన్స్ చేయవచ్చు.
లక్షల మందికి రవాణా ఊరట: భవిష్యత్ అంచనాలు
నివేదిక ప్రకారం ఈ ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో రవాణా అవసరాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం రెండు అధ్యయన ప్రాంతాల్లో 10.86 లక్షలుగా ఉన్న జనాభా 2050 నాటికి 20.88 లక్షలకు చేరుకుంటుంది. ఉద్యోగుల సంఖ్య కూడా 8.37 లక్షల నుంచి ఏకంగా 17.08 లక్షలకు పెరుగుతుంది.
2030 నాటికి నిత్యం 75 వేల మంది, 2040 నాటికి 96 వేల మంది, 2050 నాటికి ప్రతిరోజూ 1.14 లక్షల మంది ప్రయాణికులు ఈ పాడ్ కార్లలో ప్రయాణిస్తారని అంచనా వేశారు. భూ కేటాయింపులు పూర్తయి, నిర్మాణ వ్యయం, సాంకేతిక అంశాలపై ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన వెంటనే ఈ పాడ్ కార్ ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాకుండా హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గ్లోబల్ లెవెల్‌కు చేరుకోవడం ఖాయం!