Sai Pallavi: తనదైన సహజ నటన, అద్భుతమైన గ్రేస్‌తో ప్రేక్షకులను మెప్పించే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలుస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక పౌరాణిక సినిమా ‘రామాయణం పార్ట్ 1’లో ఆమె సీతాదేవిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 5న ఈ భారీ సినిమా వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ పీక్స్‌కు చేరాయి. ఇందులో భాగంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’ (KBC 18) స్పెషల్ ఎపిసోడ్‌లో రణ్‌బీర్ కపూర్, రవి దూబేలతో కలిసి సాయి పల్లవి పాల్గొని సందడి చేసింది.
ఈ సందర్భంగా కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారని బిగ్ బీ అడగ్గా, సాయి పల్లవి చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “అతను ముందుగా ఒక మంచి మనిషి అయి ఉండాలి. స్వార్థం లేకుండా, తనను తాను విశ్లేషించుకునే తత్వం ఉండాలి. ఎవరైనా తప్పులు చేయడం సహజం, కానీ ఆ తప్పులను సరిదిద్దుకునే పరిణతి ఉండాలి తప్ప ఎదుటివారిపై నెట్టేసే రకం కాకూడదు.
నా లిస్ట్ పెద్దదేమీ కాదు కానీ.. వీటికి తోడు అతనికి కాస్త వంట చేయడం కూడా వస్తే మరీ మంచిది” అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చింది. ఇక వైద్య విద్య (MBBS) పూర్తి చేసి నటన వైపు ఎలా వచ్చారని అమితాబ్ ప్రశ్నించగా.. “నేను నటించాలని ఆ దేవుడే రాసిపెట్టాడు” అని సాయి పల్లవి చెప్పింది. దీనికి వెంటనే పక్కనే ఉన్న రణ్‌బీర్ కపూర్ స్పందిస్తూ.. “ఆమె నటించాలని భగవంతుడే రాసిన ప్రిస్క్రిప్షన్ అది సార్” అంటూ పంచ్ వేయడంతో సెట్‌లోని వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
సీతాదేవి పాత్ర గురించి మాట్లాడుతూ సాయి పల్లవి కాస్త భావోద్వేగానికి గురైంది. “ఎప్పుడైనా ఏదైనా పాత్ర వస్తే దానికి నేను ఏమి న్యాయం చేయగలను అని ఆలోచిస్తాను. కానీ తొలిసారిగా సీతమ్మ పాత్ర నాకు ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది? ఈ పాత్ర ద్వారా నేను ఏం నేర్చుకోగలను? అని ఆలోచించి, సీతమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించి ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నాను” అని తెలిపింది.
దాదాపు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యష్ నిర్మిస్తున్న ఈ మైథలాజికల్ విజువల్ వండర్‌లో రణ్‌బీర్ రాముడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. మొదటి భాగం నవంబర్ 5, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కానుండగా, రెండో భాగాన్ని 2027 దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.
