UPI Payments: మనదేశంలో యూపీఐ (UPI) ద్వారా జరిగే చెల్లింపులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న దుకాణాల వరకు, చాలా మంది ఇప్పుడు యూపీఐని వాడుతున్నారు. ప్రస్తుతం ఈ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. అయితే, త్వరలోనే యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ ఛార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎన్‌డీటీవీ ప్రాఫిట్ తన కథనంలో వెల్లడించింది.
ఎండీఆర్ ఛార్జీలు ఎందుకు?
డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపులు అందించే సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఖర్చులను భర్తీ చేయడంలో వారికి సహాయపడటానికి, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. గతంలో 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న ‘జీరో ఎండీఆర్’ విధానానికి త్వరలో స్వస్తి పలకబోతున్నారు.
ఛార్జీలు ఎలా ఉంటాయి?
రూ.3,000 పైన: యూపీఐ ద్వారా రూ.3,000కు పైబడిన లావాదేవీలపై ఈ ఛార్జీలు విధించే యోచనలో ఉన్నారు. చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల మినహాయింపు కొనసాగే అవకాశం ఉంది.
లావాదేవీ విలువ ఆధారంగా: వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా, లావాదేవీ విలువ ఆధారంగానే ఈ ఎండీఆర్ విధించేందుకు చర్చలు జరుగుతున్నాయి.
ప్రతిపాదనలు: పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెద్ద వ్యాపారులపై 0.3 శాతం ఎండీఆర్ విధించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎండీఆర్ 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉన్నాయి. రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండీఆర్ విధించే ప్రసక్తి లేదని సమాచారం.
Also Read: Mahaa Conclave 2025: సీజ్ ది రైస్..సీజ్ ది షిప్..నాదెండ్ల రియాక్షన్..
వినియోగదారులపై ప్రభావం?
ఎండీఆర్ ఛార్జీలను తిరిగి తీసుకురావడం వల్ల యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ లావాదేవీల కోసం యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోరు. ఈ ఛార్జీలను వ్యాపారుల నుంచి స్వీకరించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
UPI Payments: బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వంటి వాటాదారులతో సంప్రదింపుల అనంతరం ఒకటి లేదా రెండు నెలల్లో యూపీఐ లావాదేవీలపై రుసుము విధించే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
మూడేళ్ల క్రితం వరకు యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రాసెస్ చేసేందుకు వ్యాపారులు కొంతమొత్తం ఛార్జీలను బ్యాంకులకు కట్టాల్సి వచ్చేది (ఒక శాతం లోపే). అయితే, యూపీఐ చెల్లింపులపై ఈ ఎండీఆర్ ఛార్జీలను 2022లో కేంద్రం తొలగించింది. ఆ తర్వాత ఈ ప్రాసెసింగ్ ఖర్చులను భర్తీ చేసేందుకు బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ ఛార్జీలను పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.