Tungabhadra Dam: కర్ణాటకలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నదికి ఎట్టకేలకు వరద నీరు పోటెత్తుతోంది. గత కొన్ని రోజులుగా వెలవెలబోయిన తుంగభద్ర డ్యామ్ (TB Dam) లోకి ఆలస్యంగానైనా భారీగా నీరు వస్తుండటంతో జలకళ సంతరించుకుంది. అయితే, తెలుగు రాష్ట్రాలకు అత్యంత ముఖ్యమైన శ్రీశైలం జలాశయం మాత్రం ప్రస్తుతం నీరు లేక తీవ్ర ఎండీపోతోంది. గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయగా.. ఈ ఏడాది మాత్రం అక్కడ కనీసం నీటి చుక్క జాడ కూడా కనిపించడం లేదు. కృష్ణమ్మ ఎప్పుడు పరవళ్లు తొక్కుతుందా? శ్రీశైలం గేట్లు ఎత్తే అద్భుత దృశ్యాన్ని ఎప్పుడు చూస్తామా? అని రెండు రాష్ట్రాల ప్రజలు, రైతులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
రాయలసీమ జిల్లాల తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాణాధారమైన తుంగభద్ర జలాశయానికి శుక్రవారం (జులై 10) ఉదయానికి 40 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎగువన ఉన్న తుంగ డ్యామ్ నిండిపోవడంతో అధికారులు 22 గేట్లు ఎత్తివేసి 26,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తి నీటి మట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1596.34 అడుగులకు చేరింది. అలాగే డ్యామ్ పూర్తి సామర్థ్యం 105.78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది జులై నాటికే ఈ ప్రాజెక్టులో 75 టీఎంసీల నీరు ఉండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. ఈసారి వరదలు కాస్త ఆలస్యంగా మొదలైనప్పటికీ, ఇన్-ఫ్లో భారీగా పెరుగుతుండటంతో ఆయకట్టు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
మరోవైపు, కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి మాత్రం ప్రస్తుతం దారుణంగా ఉంది. గత ఏడాది జూలై 8వ తేదీనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. శ్రీశైలం డ్యామ్ పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం కేవలం 821.60 అడుగుల వద్దే నీరు నిలిచింది. డ్యామ్ పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ఇప్పుడు కేవలం 42.01 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి ఇంకా వరద నీరు రాకపోవడమే ఇందుకు కారణం. అయితే, మహారాష్ట్ర, కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఎగువన ఉన్న ఆల్మట్టి జలాశయానికి 1,26,373 క్యూసెక్కుల వరద వస్తోంది. ముందుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాతే శ్రీశైలానికి వరద మొదలవుతుంది కాబట్టి, తెలుగు రాష్ట్రాల ప్రజలు కృష్ణమ్మ రాక కోసం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
