Rajanna Sircilla: తాను ప్రాణంగా ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమవడాన్ని తట్టుకోలేక, ఎలాగైనా ఆ వివాహాన్ని ఆపాలనే ఉద్దేశంతో ఒక ప్రియుడు చేసిన పని చివరికి అతడిని జైలు పాలు చేసింది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, త్రీటౌన్ సీఐ టాటా లక్ష్మీబాబు మీడియాకు వెల్లడించారు. అమ్మాయి పరువు తీసేలా, పెళ్లి ఆగిపోయేలా అభ్యంతరకరమైన వాల్ పోస్టర్లు అంటించిన కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన దొడ్ల వెంకటేష్ (29) అనే యువకుడు, సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లికి చెందిన ఒక యువతి గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, యువతి కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించకుండా.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడితో ఆమెకు పెళ్లి నిశ్చయించి, ముహూర్తం కూడా ఖరారు చేశారు. కేవలం కట్నకానుకల కోసమే తన ప్రేయసికి బలవంతంగా వేరే పెళ్లి చేస్తున్నారని నమ్మిన వెంకటేష్.. ఎలాగైనా ఆ పెళ్లిని చెడగొట్టాలని ఒక వినూత్నమైన, వివాదాస్పదమైన ప్లాన్ వేశాడు.
తాను ప్రేమించిన అమ్మాయితో గతంలో దిగిన ఫొటోలను, అలాగే ఆమె పెళ్లి చేసుకోబోయే వరుడి ఫొటోను, అతని తండ్రి పేరు, ఫోన్ నంబర్లతో కలిపి వెంకటేష్ పెద్ద పెద్ద వాల్ పోస్టర్లుగా ముద్రించాడు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి కారులో వెళ్లి అమ్మాయి సొంత ఊరైన ఎన్సాన్‌పల్లితో పాటు, పెళ్లి కొడుకు గ్రామమైన తంగళ్లపల్లిలో రాత్రికి రాత్రే గోడలపై, వీధుల్లో ఆ పోస్టర్లను అతికించాడు. ఉదయాన్నే లేచి గోడలపై ఉన్న ఆ పోస్టర్లను చూసిన గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు. యువకుడు కారులో వచ్చి పోస్టర్లు అంటిస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఈ దారుణమైన ఘటనపై పెళ్లి కూతురు త్రండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుని విచారించగా వారు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ కేసులో ముఖ్య సూత్రధారి అయిన ప్రియుడు దొడ్ల వెంకటేష్‌తో పాటు, అతనికి ఈ ప్లాన్‌లో సహాయం చేసిన వన్నెల అశ్విత్‌కుమార్, బండి భానుప్రసాద్, రేఖ, బురుజుకింది ఈశ్వర్, రాజబోయిన నవీన్‌కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో అమ్మాయిల జీవితాలతో, వారి కుటుంబాల పరువుతో ఆడుకుంటూ ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
