Donald Trump

Iran: డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర!.. పాత విమానంలో ట్రంప్ ప్రయాణం!

Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ దేశం ఒక సరికొత్త రహస్య ప్లాన్ వేసిందని, ఆ ప్రమాదకరమైన కుట్రను తాము ముందే కనిపెట్టామని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు (ఇంటెలిజెన్స్) సంచలన నివేదికను బయటపెట్టాయి. ఈ అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయెల్ ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో పంచుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ముదిరిన వేళ ఈ నివేదిక అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీనివల్ల పశ్చిమాసియా (Middle East) లో యుద్ధం మరింత భయంకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

అమెరికా నిఘా వర్గాలు గతంలోనూ ట్రంప్‌నకు వస్తున్న బెదిరింపులను గమనించినప్పటికీ, ఇజ్రాయెల్ దేశం ఇలా నేరుగా రంగంలోకి దిగి అమెరికాను హెచ్చరించడం ఇదే మొదటిసారి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు జరిగిన సమయంలోనే నెతన్యాహు ప్రభుత్వం ఈ సీక్రెట్ సమాచారాన్ని వాషింగ్టన్‌కు పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆ అంత్యక్రియల సమయంలో అక్కడి జనం ‘ట్రంప్‌ను చంపేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, గోడలపై రాయడం గమనార్హం. గతంలో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్ టాప్ మిలిటరీ జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా దళాలు హతమార్చాయి. అప్పటి నుంచే ట్రంప్‌పై పగ తీర్చుకుంటామని ఇరాన్ బహిరంగంగానే చెబుతోంది.

తాజాగా జరిగిన ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ లో మాట్లాడుకున్నారు. గల్ఫ్ రీజియన్‌లో అమెరికా సైన్యం చేస్తున్న కదలికలను ట్రంప్ ఈ సందర్భంగా నెతన్యాహుకు వివరించారు. ఇదే సమయంలో తుర్కియే (టర్కీ) అధ్యక్షుడు ఎర్డోగాన్ తీరుపై నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్డోగాన్ గ్రూప్ ఇజ్రాయెల్ ఉనికికే వ్యతిరేకంగా మాట్లాడుతోందని ట్రంప్‌నకు చెప్పారు. అయితే, ఇరాన్‌పై యుద్ధం విషయంలో ట్రంప్, నెతన్యాహు మధ్య కొన్ని విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై సైనిక దాడులను మరింత పెంచాలని ఇజ్రాయెల్ కోరుతుండగా.. దీనివల్ల ఆర్థికంగా భారీ నష్టం వస్తుందని భావిస్తున్న ట్రంప్, ఈ గొడవల నుంచి వెనక్కి తగ్గాలని చూస్తున్నట్లు సమాచారం. ఇరాన్‌పై మరింత గట్టిగా దాడి చేసేలా ట్రంప్ నిర్ణయాన్ని మార్చడానికే ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ హత్య కుట్ర నివేదికను బయటకు తెచ్చి ఉండవచ్చని కొందరు అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు.

మరోవైపు తన ప్రాణానికి ఉన్న ముప్పుపై ఇటీవల తుర్కియేలో జరిగిన నాటో (NATO) సదస్సులో ట్రంప్ స్వయంగా మాట్లాడారు. తాను చాలా మంది ‘హిట్ లిస్ట్’ లో ఉన్నానని, అమెరికా అధ్యక్షుడిని అడ్డు తొలగించాలని వారు (ఇరాన్) చుస్తునారు ఆయన వ్యాఖ్యానించారు. ఈ సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ ప్రయాణాల్లో ఒక ఆసక్తికర మార్పు జరిగింది. నిజానికి ఇటీవల ఖతార్ దేశం ట్రంప్ కోసం ఒక అత్యంత అధునాతనమైన, సురక్షితమైన కొత్త విమానాన్ని గిఫ్ట్‌గా ఇచ్చింది. కానీ నాటో సదస్సు ముగిసి తిరిగి అమెరికా వెళ్లే సమయంలో ట్రంప్ ఆ కొత్త విమానాన్ని కాకుండా, పాత ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానాన్ని ఉపయోగించారు. ఇరాన్ నుంచి పొంచి ఉన్న భద్రతా ముప్పు, ముందస్తు రక్షణ కారణాల వల్లే ట్రంప్ ఈ పాత విమానంలో ప్రయాణించాల్సి వచ్చిందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *