Trump-Putin: శాంతి చర్చల కోసం ప్రయత్నాలు కొనసాగుతుండగానే, రష్యా ఆదివారం ఉక్రెయిన్‌పై మూడు సంవత్సరాల యుద్ధంలో అతిపెద్ద వైమానిక దాడికి పాల్పడింది. దేశ రాజధాని కీవ్‌తో పాటు పలు ముఖ్య ప్రాంతాలపై 367 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, ఆయన చర్యలు పూర్తిగా అవివేకపూరితంగా మారాయని మండిపడ్డారు. “పుతిన్ నాకు గతంలో స్నేహితుడే. కానీ ఇప్పుడు అతడు తన తీరును కోల్పోయాడు. నిర్దాక్షిణ్యంగా, అవసరం లేకపోయినా అమాయకులపై దాడులు చేస్తూ ఉక్రైన్ నగరాలను క్షిపణులు, డ్రోన్లతో ధ్వంసం చేస్తున్నాడు. ఇది మానవతా విలువలకు విరుద్ధం,” అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
పుతిన్ ఉక్రెయిన్‌లో కొంత భూభాగం మాత్రమే కాదు, మొత్తం దేశాన్ని ఆక్రమించాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. “ఇది అతని దృష్టిలో విజయంగా కనిపించవచ్చేమో కానీ, ఇది చివరికి రష్యా పతనానికి దారితీస్తుంది,” అని హెచ్చరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తీరుపైనా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. “అతడి మాటలు పరిస్థితిని చక్కదిద్దడంలో కాదు, మరింత చిచ్చుపెట్టడంలో భాగమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జెలెన్‌స్కీ మాట్లాడే ప్రతి మాట సమస్యలకు దారి తీస్తోంది,” అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
Trump-Putin: ఈ పరిణామాల నడుమ ట్రంప్, పుతిన్ మధ్య ఫోన్ సంభాషన జరిగింది. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగినట్టు సమాచారం. కాల్పుల విరమణ సాధించేందుకు తక్షణ చర్చలు అవసరమని ట్రంప్ పుతిన్‌కు తెలిపారు. అయితే, ఇప్పటివరకు పుతిన్ వర్గం నుంచి శాంతికి అనుకూలంగా ఏమైనా హామీ లభించలేదని తెలిసింది. ఈ దాడులపై అమెరికా తాజా అధికార ప్రణాళికపై కొంతకాలంగా మౌనంగా ఉండటంపై జెలెన్‌స్కీ అసహనం వ్యక్తం చేశారు. “వాషింగ్టన్ మౌనం కొనసాగితే, అది పుతిన్‌కు మరింత ధైర్యాన్ని ఇస్తుంది,” అని ఆయన హెచ్చరించారు.