Udhayanidhi Stalin

Udhayanidhi Stalin: వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను నమ్మం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

Udhayanidhi Stalin: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. డీఎంకే (DMK) నేత ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ లాభాల కోసం కాంగ్రెస్ పార్టీ తమకు వెన్నుపోటు పొడిచిందని ఆయన మండిపడ్డారు. గత 20 ఏళ్లుగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తమపైనే ఆధారపడి బతికిందని, కానీ ఈ రోజు కేవలం అధికారం కోసం టీవీకే (TVK) పార్టీతో చేతులు కలిపిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన ఈ మోసాన్ని డీఎంకే శ్రేణులు ఎప్పటికీ మర్చిపోవద్దని, భవిష్యత్తులో ఆ పార్టీ నాయకులను తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుందని ఈ ఘటనతో మరోసారి రుజువైందని ఉదయనిధి అన్నారు. దేశంలో బీజేపీ వరుసగా గెలవడానికి ప్రధాని మోదీ, అమిత్ షాలే కారణమని తాను ఇన్నాళ్లూ అనుకున్నానని, కానీ అది నిజం కాదని చెప్పారు. కాంగ్రెస్ నాయకుల చేతకానితనం వల్లే దేశంలో ప్రజలు బీజేపీకి ఓట్లు వేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సీట్లు, అసెంబ్లీ సీట్లు వచ్చాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా డీఎంకే కార్యకర్తలు రాత్రింబగళ్లు కష్టపడి పనిచేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లు గెలవగలిగిందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా, గెలిచిన వెంటనే అధికారం కోసం కాంగ్రెస్ నేతలు వేరే పార్టీ వైపు పరుగులు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే తమిళనాడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. అలాగే, ఎన్నికల్లో డీఎంకే ఓటమిపై స్పందిస్తూ.. పార్టీ అంతర్గత వ్యూహాల్లో లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *