Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడంతోపాటు, ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చే విధంగా పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రజాభవన్‌లో జరిగిన పారిశ్రామిక ప్రమోషన్ సబ్‌కమిటీ సమావేశంలో ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
శనివారం ప్రత్యేక సమావేశాలు
ఇక నుంచి ప్రతీ శనివారం పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎంవోయూల అమలు పురోగతి, కొత్త పరిశ్రమల స్థాపన, అనుబంధ యూనిట్ల ప్రోత్సాహంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
హ్యుందాయ్ ఆర్‌అండ్‌డీ కేంద్రానికి ఆమోదం
జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో హ్యుందాయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ స్థాపనకు సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. రూ. 8,528 కోట్ల పెట్టుబడితో 675 ఎకరాల్లో ఏర్పడనున్న ఈ సెంటర్ ద్వారా 4,276 మంది యువతకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు హ్యుందాయ్ ప్రతినిధులు వివరించారు.
ఇది కూడా చదవండి: Crime News: అత్యాచారం తర్వాత కూడా తగ్గని కామాంధుల కామం.. చివరికి ఏం చేశారు అంటే
ఈ కేంద్రంలో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్, పైలట్ లైన్, ప్రోటోటైపింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉండనున్నాయి. ఇది రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మైలురాయిగా నిలవనుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
వ్యూహాత్మక ప్రణాళికతో ముందడుగు
ఒక పరిశ్రమ స్థాపనతో అనుబంధ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఏర్పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగాలని భట్టి సూచించారు. తద్వారా యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు, రాష్ట్రానికి స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశం ద్వారా రాష్ట్రం పారిశ్రామిక పురోగతికి బలమైన పునాదులు పడతాయని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు.