Kavitha

Kavitha: నిజామాబాద్‌లో నేడు ‘తెలంగాణ రక్షణ సేన’ పాంచజన్య సంకల్ప సభ

Kavitha: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నేడు రాజకీయ సందడి నెలకొంది. సరికొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) స్థాపించిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత మొదటిసారి జిల్లా పర్యటనకు విచ్చేస్తుండటంతో నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. స్థానిక ఓల్డ్ కలెక్టరేట్ మైదానంలో నిర్వహించనున్న ‘పాంచజన్య సంకల్ప సభ’ కోసం పార్టీ శ్రేణులు అత్యంత భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 30 వేల మందికి పైగా కార్యకర్తలు, ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.

పర్యటన మరియు ర్యాలీ పూర్తి వివరాలు..

  • గన్నారంలో జెండా ఆవిష్కరణ.
    హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన కల్వకుంట్ల కవిత.. మధ్యాహ్నం 2:30 గంటలకు ఇందల్వాయి మండలానికి చేరుకుంటారు. గన్నారంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
  • భారీ బైక్/కార్ల ర్యాలీ.
    మధ్యాహ్నం 2:45 గంటలకు మాధవ నగర్ సాయిబాబా ఆలయం వద్ద నుంచి కవితకు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ పూలాంగ్ చౌరస్తా, రాజ రాజేంద్ర చౌరస్తా, పెద్ద బజార్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా సభా ప్రాంగణమైన ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్‌కు చేరుకుంటుంది.

పాంచజన్య సంకల్ప సభ & ఆలయ దర్శనం.

  • మధ్యాహ్నం 3:30 గంటలకు సభ
    ఓల్డ్ కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకుని కవిత ప్రసంగిస్తారు. మైదానంలో 10 వేల మంది కూర్చునేలా సిట్టింగ్ సౌకర్యంతో పాటు భారీ ఎల్ఈడీ స్క్రీన్లను సిద్ధం చేశారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సిద్ధాంతాలను ఈ వేదికగా ఆమె వెల్లడించనున్నారు.
  • సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక పూజలు

    సభ ముగిసిన అనంతరం కవిత నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా కవిత పర్యటనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, పార్టీ తోరణాలు పెద్ద ఎత్తున వెలిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *