International Anti-Corruption Day: ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య అవినీతి. ఇది దేశం సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. శాంతిభద్రతలు ఉన్నా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా అవినీతికి అడ్డుకట్ట పడలేదు. ప్రస్తుత రోజుల్లో అవినీతి పెరిగిపోతుంది. దీని వల్ల పేదలు పేదలుగా మిగిలిపోతుంటే ఒక వర్గం మాత్రమే ధనవంతులు అవుతున్నారు. అందుకే అవినీతికి పాల్పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవినీతి దేశాల లిస్ట్ లో మన దేశం ఎక్కడ ఉందో ఒకసారి తెలుసుకుందాం.
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం చరిత్ర
అవినీతిని నిరోధించడం ప్రపంచంలోని అతిపెద్ద సమస్యల్లో ఒకటి. అవినీతి కార్యకలాపాలకు పాల్పడకుండా సాధారణ ప్రజలకు – ప్రభుత్వ అధికారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో 2003 అక్టోబర్ 31న అంతర్జాతీయ అవినీతి దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రపంచ సంస్థ జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. అందుకే ఈ ప్రత్యేక అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు.
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రాముఖ్యత
అవినీతి కార్యకలాపాలను అరికట్టడం అలాగే ఈ దుష్ట చర్యలకు పాల్పడకూడదనే అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమం కోసం అవినీతిని అరికట్టడం అవసరం. ఈ విషయంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం చాలా ముఖ్యమైనది. ప్రతి దేశంలోని ప్రభుత్వ అధికారులు, సివిల్ సర్వెంట్లు, అధికారులు, మీడియా ప్రతినిధులు, పౌర సమాజం, విద్యావేత్తలు, ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి. ఈ రోజున సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారాలు, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఈ ఏడాది జనవరిలో ప్రపంచంలోని అత్యంత అవినీతి దేశాల జాబితాను విడుదల చేసింది. కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 180 దేశాలు , భూభాగాలపై ఆధారపడి ఈ రిపోర్ట్ ఇచ్చింది. 2023 కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్‌లో భారతదేశం 39 స్కోర్‌తో 93వ స్థానంలో ఉంది. 2022లో 85వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 93వ స్థానానికి చేరుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. పొరుగు దేశాలైన పాకిస్థాన్ 133, శ్రీలంక 115, బంగ్లాదేశ్ 149, ఆఫ్ఘనిస్తాన్ 162, చైనా 76, జపాన్ 16 స్థానాలను పొందాయి. ప్రభుత్వ రంగ అవినీతిని నియంత్రించడంలో చాలా దేశాలు ఎలాంటి పురోగతి సాధించలేదని నివేదిక పేర్కొంది.