Ebola Outbreak: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం నిఘాను తీవ్రం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం సీనియర్ అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అయితే, ప్రస్తుతానికి భారతదేశంలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.
దేశంలోకి ఈ వైరస్ రాకుండా ముందస్తుగా అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు, రేవు సీ పోర్టులు మరియు సరిహద్దు ప్రాంతాలలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎబోలా స్క్రీనింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల వైరస్ లక్షణాలు ఉన్నవారిని ముందే గుర్తించి దేశంలోకి వ్యాపించకుండా అడ్డుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
దీంతో పాటు ఎబోలా వైరస్‌ను వేగంగా గుర్తించడం, టెస్టింగ్‌లు నిర్వహించడం మరియు నిరంతరం నిఘా పెట్టడం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) సంస్థలకు మంత్రి జేపీ నడ్డా కీలక సూచనలు చేశారు.
కేంద్రమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల ఉన్నతాధికారులతో విడిగా సమావేశమయ్యారు. విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా ఉంచడంతో పాటు, ఒకవేళ వైరస్ దేశంలోకి ప్రవేశిస్తే తీసుకోవాల్సిన అత్యవసర జాగ్రత్తలు, చికిత్స ఏర్పాట్లపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని, వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
