Telangana:రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారు అయిందని విశ్వసనీయ సమాచారం. ఆరు స్థానాలకు గాను నలుగురి పేర్లు మంత్రి పదవులకు ఖరారైనట్టు తెలిసింది. మరో రెండు స్థానాలకు పెండింగ్‌లో ఉంచనున్నట్టు తెలిసింది. ఆశావహులను బుజ్జగించే పనిలో ఏకంగా కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు. అవసరమైతే ఏకంగా రాహుల్‌ను కూడా రంగంలోకి దింపే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
Telangana:జరుగుతున్న పరిణామాలు బట్టి త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తున్నది. పీసీసీ కార్యవర్గాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నది. సామాజిక సమీకరణాల రీత్యా మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాని పలువురు ఆశావహులకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఆయా నేతలను పార్టీ పెద్దలు ఇప్పటి నుంచే బుజ్జగిస్తున్నారు. ఒకవేళ వారు పేచీ పెడితే మాత్రం మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు.
Telangana:రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాదికాలంగా వాయిదాలు పడుతూ వస్తున్నది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పలుమార్లు డేట్లు ఫిక్స్ అయినా వాస్తవరూపం దాల్చలేదు. అయితే తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కీలక నేత కేసీ వేణుగోపాల్ చర్చించారు. మంత్రివర్గ విస్తరణ అంశంతోపాటు టీపీసీసీ కార్యవర్గంపై వారితో చర్చించారు. ఒకేసారి ఆ రెండు జాబితాలను ప్రకటించాలని భావించినా, మంత్రి పదవులు దక్కనివారికి పార్టీ పదవులు ఇచ్చి సంతృప్తి పర్చాలనే ఉద్దేశంతో వేర్వేరుగా ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ఆ నలుగురు వీరే?
Telangana:ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కేసీ వేణుగోపాల్ సుదీర్ఘ మంతనాల అనంతరం ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మైనార్టీ వర్గం నుంచి అమీర్ అలీఖాన్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ పేర్లను ఎంపిక చేశారని విశ్వసనీయ సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి మరొకిరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ వస్తుండటంతో ఆ సామాజికవర్గ సీనియర్ ఎమ్మెల్యేల జాబితాను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఆ ఇద్దరికి అధిష్ఠానం బుజ్జగింపులు
Telangana:ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ దశలో వీరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్, మరొకరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలనే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు వారిద్దరికీ కాంగ్రెస్ కీలక నేత చర్చిస్తున్నట్టు తెలిసింది.
Telangana:రాజగోపాల్‌రెడ్డితో కేసీ వేణుగోపాల్ ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. పార్టీలో కీలక పదవిని ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి ఒప్పుకోకుంటే ఏకంగా రాహుల్‌గాంధీ రంగంలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్నది. రాజగోపాల్‌రెడ్డిని రాహుల్‌గాంధీతో మాట్లడించే అవకాశం ఉన్నదని సమాచారం. వీరిద్దరూ పార్టీ, ప్రభుత్వ పదవులను ఒప్పుకుంటే వారంలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, లేదంటే మరికొంత కాలం జాప్యం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.