Telangana: ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో కీలక మలుపు తిరగనున్నది. ఈ ఏడాది పాలనా కాలంలో ఇచ్చిన హామీల అమలు చేయలేదనే అపవాదు నుంచి బయటపడేందుకు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు ఈ నెలలోనే నాలుగు పథకాల అమలుకు శ్రీకారం చుట్టనున్నది. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధికి కూడా ఇదే అదునుగా భావిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదైతేనేమి కానీ, ఒకేసారి నాలుగు పథకాలను అమలు చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామమే.
Telangana: ఈ నాలుగు పథకాల అములకు శనివారం నుంచి గ్రామ, వార్డుసభలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు అర్హులను గుర్తించాలని చెప్పారు. ఈ నెల 24లోగా సభలను పూర్తిచేసి, జాబితాలను ఇవ్వాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకేచోట రేషన్‌కార్డు ఉండాలని, వేర్వేరు చోట్ల ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయానికి అనర్హమైన భూమలను నిజాయితీగా గుర్తించాలని ఆదేశించారు. నిజమైన భూమిలేని పేదలను గుర్తించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించాలని ఆదేశాలు ఇచ్చారు.
Telangana: నిన్న జరిగిన కలెక్టర్లు, ఉన్నతాధికారుల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ఈ కీలక పథకాల అమలు విషయాలను వెల్లడించారు. ఎప్పుడెప్పుడా అని రాష్ట్రంలోని అన్నదాతలు ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని ఈ నెల 26 నుంచే ఆరంభించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ యాసంగి విడత ఇవ్వనున్నది. అయితే ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామన్న కాంగ్రెస్.. నేడు రూ.12 వేలకే కుదించడంపై అన్నదాతల్లో అసంతృప్తి నెలకొన్నది. తొలుత నిబంధనలు పెడతామనడంతో పెద్ద ఎత్తున రైతుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సాగు యోగ్యమైన భూములన్నింటికీ ఇస్తామని ప్రకటించింది.
Telangana: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ నెల 26 నుంచి ఏటా రూ.12 వేలు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించనున్నది. అయితే భూమి లేని పేదల గుర్తింపు విషయంలో కొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. గ్రామసభల్లో వివరాలు సేకరించినా, వాటిని వాస్తవ జాబితా ఎంపికలో కొంత ఆలస్యమవుతుంది. దానిపై ఇప్పటికే ప్రభుత్వం ఏమైనా వివరాలు సేకరించి ఉన్నదో ఏమో తెలియాలి.
Telangana: తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఆన్‌లైన్ రేషన్ కార్డులు ఉన్నా.. కార్డు రూపంలో రాలేదు. దీంతో ఈ ప్రభుత్వం నూతన కార్డుల మంజూరుకు ఈ నెల 26 నుంచి శ్రీకారంచుట్టనున్నది. అదే విధంగా అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయనున్నది. దీంతో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఎందరో అర్హులకు రేషన్‌కార్డులు మంజూరు కానున్నాయి. అదే విధంగా పేర్లను కూడా చేర్చుకోవచ్చని ప్రభుత్వం అవకాశం కల్పించనున్నది.
Telangana: ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ఈనెల 26 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున తొలి విడుత మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల వివరాల ప్రకారం.. అర్హుల జాబితా రూపొందించింది. ఆ మేరకు ఇండ్ల పరిశీలన చేపట్టింది. అది కూడా 95 శాతం మేరకు పూర్తికావచ్చింది. అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యంగా గుర్తిస్తామని, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆమోదంతో గ్రామసభల్లో అర్హుల జాబితాను ప్రదర్శించాలని సీఎం చెప్పారు.