Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఒకేసారి బీజేపీలో చేరడంతో అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కీలక నేతలుగా ఉన్న రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, స్వాతి మలివాల్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీలు అధికారికంగా కాషాయ కండువా కప్పుకున్నారు. రాజ్యసభలో ఆప్‌కు ఉన్న మొత్తం 10 మంది ఎంపీల్లో ఏడుగురు వెళ్లడంతో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆ పార్టీ పార్లమెంటరీ విభాగం బీజేపీలో విలీనమైంది.
పార్టీని వీడిన అనంతరం రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 15 ఏళ్లుగా ఆప్ కోసం రక్తం, చెమట ధారపోశానని, కానీ ప్రస్తుతం ఆ పార్టీ తన నైతిక విలువలను కోల్పోయిందని విమర్శించారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాలకే పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవస్థాపక సభ్యుడైన తన గొంతును కూడా నొక్కే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సరైన సిద్ధాంతాలు ఉన్న బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చద్దా స్పష్టం చేశారు.
రాజ్యసభ నిబంధనల ప్రకారం, ఏదైనా పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల (2/3) సభ్యులు విడిపోయి మరో పార్టీలో చేరితే, వారిపై అనర్హత వేటు పడదు. ఆప్ ఎంపీల బలం 10 కాగా, అందులో ఏడుగురు అంటే మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది సభ్యులు మారడంతో ఈ విలీనం చెల్లుబాటు అవుతుంది. ఈ పరిణామంతో అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ, ఇటు రాజ్యసభలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ బలం గణనీయంగా తగ్గిపోయింది.
బీజేపీలో చేరిన ఎంపీల జాబితా:
* రాఘవ్ చద్దా
* సందీప్ పాఠక్
* అశోక్ మిట్టల్
* స్వాతి మాలివాల్
* హర్భజన్ సింగ్
* రాజిందర్ గుప్తా
* విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ
