Bandi Sanjay: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ఆత్మహత్య మాత్రమే కాదని, ముమ్మాటికీ ప్రభుత్వమే చేసిన హత్య అని ఆయన విమర్శించారు. శనివారం కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను, కార్మికులను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఆర్టీసీ కార్మికులు కొత్త డిమాండ్లు ఏవీ అడగడం లేదని, కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయమని కోరుతున్నారని బండి సంజయ్ గుర్తు చేశారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోందని ఆయన విమర్శించారు. కార్మికుల న్యాయమైన కోరికలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
చివరగా, ఆర్టీసీ కార్మికులకు ఆయన ఒక కీలక విన్నపం చేశారు. సమస్యలు ఎంత కష్టంగా ఉన్నా ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కార్మికులు ప్రాణాలు తీసుకోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడతాయని, ధైర్యంగా ఉండి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బండి సంజయ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
