Telangana News: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఆయా అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇప్పటికే రాష్ట్రప్రజల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పథకాలపైనే సీఎం నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.
Telangana News: హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రైతుభరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై ఆయా జిల్లాల అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా ఇవ్వనున్నట్టు ఇటీవల క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయించారు. ఆనాటి నుంచి రైతుల ఖాతాల్లో ఎకరాకు ఏటా రూ.12 వేల చొప్పున ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Telangana News: ఈ నెల 26 నుంచే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైనా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లపైనా అనుమానాలు ఉన్నాయి. సొంత జాగ ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడత ఇస్తామని నిన్ననే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. మలి విడతలో ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. వీటితోపాటు తొలి విడతలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలను కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Telangana News: అదే విధంగా నూతన రేషన్‌కార్డుల పంపిణీ, సన్నబియ్యం పంపిణీపైనా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. నూతన రేషన్‌కార్డులను ఈ నెల 26 నుంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, మంజూరు అంశాలపై లోతుగా చర్చిస్తారని సమాచారం. అర్హుల అంశంపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.