Telangana: ఏడాదిగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఈసారి ఖాయంగా కనిపిస్తున్నది. ఈ విషయంపై ఢిల్లీలో తాజాగా అధిష్ఠానంతో చర్చలు జరిగినట్టు సమాచారం. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన రాష్ట్ర ముఖ్య నేతలతో ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మంత్రివర్గ విస్తరణ అంశం కూడా ఉన్నదని తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన పలువురు ఆశావహులు మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై అంతటా ఉత్కంఠ నెలకొన్నది.
Telangana: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సహా 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉన్నది. దీంతో మరో నలుగురిని మాత్రమే మంత్రులుగా తీసుకుంటారనే చర్చ కొనసాగుతున్నది. మరో రెండు బెర్తులను ఖాళీ ఉంచుతారని అంటున్నారు. అయితే సీనియారిటీ, సామాజిక సమీకరణాలు, వారి పనితీరును ఆధారంగా చేసుకొని ఎంపిక ఉంటుందని అందరూ భావిస్తున్నారు. వారు ఎవరనే విషయాలపైనా గత ఆరునెలలుగా జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది.
Telangana: కాంగ్రెస్ అధిష్టానం హామీ మేరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌ను మంత్రులుగా తీసుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతున్నది. ముదిరాజ్ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. ఈ ముగ్గురి విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా బహిరంగంగానే హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు.
Telangana: నిజామాబాద్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత, బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డి పేరు తొలి నుంచే అనుకున్నా ఆనాడు అవకాశం రాలేదు. ఇప్పుడు సీనియరిటీ ప్రాతిపదికన ఆయనకు మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు.
గడ్డం వివేక్ సోదరుడు గడ్డం వినోద్ కూడా తనకే మంత్రి పదవి దక్కాలని భీష్మించుకొని ఉన్నారు. పార్టీ మారినోళ్లకు మంత్రి పదవి ఇస్తే, మారని తనకు ఎందుకు ఇవ్వరంటూ డిమాండ్ చేస్తున్నారు.
Telangana: హైదరాబాద్ నగరం నుంచి ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి ఆశావహుల్లో ఉన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, మైనార్టీ కోటాలో అజారుద్దీన్, షబ్బీర్ అలీ పోటీ పడుతున్నారు. మరివీరిలో ఎవరికి దక్కుతుందో? మరో కొత్త నేతలకు అవకాశం వస్తుందో? త్వరలో తేలనున్నది.
Telangana: ఇదిగాక మరో సంచలన విషయం హల్‌చల్ చేస్తున్నది. ఉన్న మంత్రివర్గంలో ముగ్గురికి ఉధ్వాసన పలుకుతారని చర్చ జరుగుతున్నది. ఆ ముగ్గురి స్థానంలో మరో ముగ్గురికి, అంతకు ముందు అనుకున్నట్టు మరో నలుగురికి మొత్తంగా ఏడుగురికి విస్తరణలో మంత్రులుగా అవకాశం కల్పించే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.