TG Assembly: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండో రోజూ తీవ్ర రాజకీయ వేడికి, భావోద్వేగాలకు వేదికగా మారాయి. నిన్న అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్న ఘటనలపై సభ ప్రారంభమైన వెంటనే అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రసంగిస్తున్న సమయంలో జోక్యం చేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనై ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌరవ సభ కాస్తా.. కౌరవ సభగా మారింది.. హరీశ్‌రావు
సీనియర్ మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిల పట్ల అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని హరీశ్‌రావు మండిపడ్డారు. దాడి చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఠాణాలో ఫిర్యాదు చేస్తే, తిరిగి బీఆర్‌ఎస్ నేతలపైనే అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.
అసెంబ్లీ గేటు వద్ద మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారానికి సంబంధించి సమగ్ర విచారణ నివేదిక రాగానే బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సభాపతి స్పష్టం చేశారు.
