Chandrababu

Chandrababu: గూగుల్ మన వద్దకు వస్తే ఇతర రాష్ట్రాలు అసూయపడ్డాయి..

Chandrababu: రాష్ట్ర స్థూల అభివృద్ధి (GSDP) సాధించాలంటే అది క్షేత్రస్థాయిలో నియోజకవర్గ స్థాయి అభివృద్ధితో అనుసంధానమవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ‘సుస్థిర అభివృద్ధి’పై ఆయన సమగ్రంగా మాట్లాడారు. అభివృద్ధిపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా పనిచేయాలని, ఓటు వేసే అలవాటు లేని వారిని కూడా మార్చి పార్టీ ఓటు బ్యాంకును విస్తరించుకోవాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు, గూగుల్ ప్రాజెక్ట్, సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ముఖ్యమంత్రి కీలక వివరాలు వెల్లడించారు.

గూగుల్ రాకపై కొందరి కుట్రలు – నీటి లభ్యత సమస్యే కాదు..

గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ ఏపీకి వస్తుంటే పొరుగు రాష్ట్రాలు అసూయపడ్డాయని, అదే సమయంలో రాష్ట్రంలోని కొందరు వ్యక్తులు సైతం అడ్డుకునేందుకు కుట్రలు పన్నారని సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
డేటా సెంటర్ల నిర్వహణకు అవసరమైన 5 టీఎంసీల నీటిని అందించడం ప్రభుత్వానికి అసలు సమస్యే కాదని చంద్రబాబు తేల్చిచెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు దాదాపు 2 టీఎంసీల నీటిని తరలించే పూర్తి సామర్థ్యం ఉందని వివరించారు. ఈ కేంద్రాల ద్వారా లక్షలాది మంది యువతకు విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

 

నియోజకవర్గాల జీఎస్‌డీపీ వృద్ధి – లక్ష్యాలు..

ప్రస్తుతం విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట, నెల్లూరు సిటీ, చిలకలూరిపేట, తణుకు నియోజకవర్గాలు జీఎస్‌డీపీ సాధనలో ముందంజలో ఉన్నాయని సీఎం వెల్లడించారు.

 

రూ.20.35 లక్షల కోట్ల లక్ష్యం..
2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా అంచనా వేశామని, దాదాపు 15 నుంచి 20 కీలక రంగాలలో వృద్ధిని పరుగులు పెట్టించేలా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ విధానంతో ప్రతి ఇంటికీ ఆర్థిక అభివృద్ధి ఫలాలు చేరాలన్నారు.

రూ.35,000 కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులు:

నీటిపారుదల రంగానికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు..
నదుల అనుసంధానం..
గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, తుంగభద్ర, కావేరి నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాలను నింపి 1,250 నుంచి 1,400 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసే స్థాయికి చేరుకుంటామని తెలిపారు.

 

ప్రాజెక్టుల లక్ష్యాలు..
రాబోయే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పోలవరం ఫేజ్-2 పూర్తయితే 190 టీఎంసీలు, బొల్లాపల్లి నిర్మిస్తే 350 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని చెప్పారు. వెలిగొండలో ప్రస్తుత సీజన్‌లో 10.7 టీఎంసీలు నిల్వ చేస్తుండగా, వచ్చే ఏడాదికి 50 టీఎంసీలు నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పార్టీయే సుప్రీం.. పదవుల్లో ఉన్నవారిని గౌరవించాలి.. మంత్రి నారా లోకేష్
కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పార్టీ నాయకత్వ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు:
పార్టీ బాధ్యతలకే తొలి ప్రాధాన్యం..
మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా పార్టీ ఇచ్చే బాధ్యతలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తేల్చిచెప్పారు. క్వాంటమ్ టవర్స్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సైతం పక్కనపెట్టి తాను పార్టీ వర్క్‌షాప్‌కే హాజరైన విషయాన్ని ఉదాహరణగా చెప్పారు.

 

బీ-ఫారమ్ ప్రాముఖ్యత..

పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బీ-ఫారమ్ ఇవ్వకపోతే ఎవరూ మంత్రులు, ఎమ్మెల్యేలు కాలేరని లోకేష్ గుర్తుచేశారు. పార్టీ సంస్థాగత పదవుల్లో ఉన్న నాయకులను ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా గౌరవించాలని, పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఎవరి అనుమతులూ అవసరం లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *