Erravalli 

Erravalli: కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ డప్పుల మోత నిరసన.. బారికేడ్ల ధ్వంసం..!

Erravalli: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి గ్రామ పరిసరాలు తీవ్ర ఉద్రిక్తతలకు వేదికయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం (ఫామ్‌హౌస్) ముట్టడికి కాంగ్రెస్ పార్టీ ‘డప్పుల మోత’ పేరుతో పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు బీఆర్‌ఎస్ శ్రేణులు సైతం భారీగా మోహరించడంతో ఎర్రవల్లి రణరంగాన్ని తలపించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు యంత్రాంగం భారీగా మోహరించి బారికేడ్లు, రోప్ పార్టీలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

బారికేడ్లు తోసుకుని దూసుకెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు – తోపులాట..

నర్సారెడ్డి ఆధ్వర్యంలో వరదరాజపూర్ మీదుగా భారీగా చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ ఫామ్‌హౌస్ వైపు దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. బారికేడ్లను తోసుకుని కొందరు కార్యకర్తలు ఫామ్‌హౌస్‌కు దాదాపు అర కిలోమీటరు సమీపంలోకి వెళ్లి డప్పులు మోగిస్తూ నినాదాలు చేశారు.

 

డీసీసీ అధ్యక్షురాలి పరుగు – పోలీసులకు గాయాలు..
డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి బారికేడ్లను తోసుకుని నేరుగా ఫామ్‌హౌస్ వైపు పరుగు తీయడంతో పోలీసులు ఆమెను అడ్డుకుని వెనక్కి పంపారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పలువురు పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.

 

మర్కుక్ వద్ద బీఆర్‌ఎస్ ‘రైతు దీక్ష’..
మరోవైపు మర్కుక్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా మోహరించాయి. ఫామ్‌హౌస్ సమీపంలో ‘రైతు దీక్ష’ పేరుతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఎదురు నిరసనకు దిగడంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

బొల్లారం వద్ద కేటీఆర్, హరీశ్‌రావుల నిర్బంధం – పాదయాత్ర..

ఫామ్‌హౌస్ వద్ద ఉద్రిక్తతల సమాచారం అందుకున్న వెంటనే శాసనసభ సమావేశాల నుంచి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పార్టీ ఎమ్మెల్యేలు నేరుగా ఎర్రవల్లికి వాహనాల్లో బయల్దేరారు.

 

హకీంపేట వద్ద అడ్డగింత..
అయితే శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బొల్లారం, హకీంపేట చెక్‌పోస్టుల వద్ద వారి కాన్వాయ్‌లను నిలిపివేశారు. దీంతో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
బొల్లారం నుంచి పాదయాత్ర..

పోలీసులు వాహనాలను అనుమతించకపోవడంతో కేటీఆర్, హరీశ్‌రావు ఇతర నేతలతో కలిసి బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవల్లి వైపునకు పాదయాత్రగా బయల్దేరారు. ప్రభుత్వమే పోలీసుల అండతో కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొల్పి దాడులకు పురిగొల్పుతోందని, ప్రతిపక్ష నేతలకు స్వేచ్ఛ లేకుండా చేస్తోందని ఈ సందర్భంగా వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉదయం నుంచి ఎర్రవల్లి, మర్కుక్, బొల్లారం పరిసర ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *