Telangana: నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఇంటెలిజెన్స్ ఎస్పీ కవితపై అనేక అవినీతి ఆరోపణలపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. ఈ మేరకు ఆమెపై వేటు వేసింది. ఇప్పటికే ఆమెపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీస్ శాఖ ఆమెను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర విచారణ అనంతరం ఆమెపై తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.
Telangana: ఇంటెలిజెన్స్ ఎస్పీ కవితపై అనేక అక్రమాలు, వసూళ్ల ఆరోపణలు వచ్చాయి. పోలీస్ శాఖతోపాటు నేరుగా ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు అందాయి. సొంత సిబ్బంది నుంచి కూడా భారీగా వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. రేషన్, గుట్కా, మాఫీయా నుంచి పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
Telangana: జిల్లా ఇంటెలిజెన్స్ అధిపతిగా ఆమె నల్లగొండలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నది. ఎస్పీ కవిత అక్రమాల్లో ఒక ఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు పాలుపంచుకున్నారని సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతున్నది. కవిత అక్రమాలపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర నిఘా విభాగం గత 15 రోజులుగా విచారణ చేస్తున్నది.
Telangana: ఇదిలా ఉండగా మరో బాగోతం బయటకొస్తున్నది. అవినీతిని బయటపెడతామంటూ ఇంటెలిజెన్స్ ఎస్పీ కవితను నల్లగొండ పట్టణానికి చెందిన నలుగురు రిపోర్టర్లు బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలొచ్చాయి. కవిత బలహీనతను ఆసరా చేసుకున్న ఆ నలుగురు విలేకరులు ఆమె నుంచి భారీగా నగదు వసూలు చేశారని సమాచారం. దీనిపై ఇంకా లోతైన పరిశీలన చేస్తే మరింత అవినీతి బండారం బయటపడే అవకాశం ఉన్నదని అంటున్నారు.