Donald Trump

Donald Trump: ఈరోజు ఇరాన్ పై దాడులు చేయాలి.. కానీ వాయిదా వేషం.. ఎందుకంటే..?

Donald Trump: ప్రపంచాన్ని మరో భారీ యుద్ధ ముప్పు నుండి కాపాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై జరపాలని భావించిన సైనిక దాడులను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల అధినేతలు స్వయంగా రంగంలోకి దిగి చేసిన విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ (Truth Social) లో ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

గల్ఫ్ దేశాల ఉమ్మడి వ్యూహం.. ఎందుకంటే?

ట్రంప్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ सల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లు అమెరికాను ఈ దాడులు ఆపాలని కోరారు. ఇరాన్‌తో ప్రస్తుతం అత్యంత ‘కీలక చర్చలు’ (Serious Negotiations) జరుగుతున్నాయని, ఈ సమయంలో దాడులు చేస్తే పరిస్థితి చేజారుతుందని వారు వారించారు.

గత కొన్ని నెలలుగా అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ జరుపుతున్న దాడుల వల్ల ఈ గల్ఫ్ దేశాలే ఎక్కువగా నష్టపోతున్నాయి. ఇరాన్ విషయంలో గల్ఫ్ శక్తుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, వాషింగ్టన్ – టెహ్రాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం రాకుండా అడ్డుకోవడంలో గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఏకతాటిపైకి రావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఒప్పందం కుదిరితే సరే.. లేదంటే భారీ యుద్ధమే!

గల్ఫ్ నేతలను “గొప్ప నాయకులు, నమ్మకమైన మిత్రులు” గా అభివర్ణించిన ట్రంప్, వారిపై ఉన్న గౌరవంతోనే ఈ దౌత్య చర్చలకు చివరి అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. అయితే, ఇదే సమయంలో ఆయన ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు:

  • అణ్వాయుధాలు ఉండకూడదు: కొత్తగా కుదిరే ఒప్పందం ప్రకారం ఇరాన్ వద్ద ఎలాంటి అణ్వాయుధాలు లేకుండా (NO NUCLEAR WEAPONS) చూస్తామని ట్రంప్ అన్నారు. ఒకవేళ చర్చలు విజయవంతమైతే ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనే అవకాశం ఉంది.

  • సైన్యం అలెర్ట్: ఒకవేళ ఈ దౌత్య చర్చలు విఫలమైతే, ఇరాన్‌పై “పూర్తి స్థాయి, భారీ దాడి” (Full, large scale assault) కి సిద్ధంగా ఉండాలని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, సైనిక బలగాలను ట్రంప్ ఆదేశించారు.

మధ్యవర్తిగా పాకిస్తాన్.. ఇరాన్ 14 సూత్రాల ప్లాన్

మరోవైపు ఇరాన్, అమెరికా దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్తాన్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రముఖ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ ప్రకారం.. ఇరాన్ సిద్ధం చేసిన 14 సూత్రాల సవరించిన శాంతి ప్రతిపాదనను పాకిస్తాన్ దౌత్య మార్గాల ద్వారా అమెరికాకు చేరవేసింది. యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. అయితే, ఈ ప్రతిపాదనల్లో పెద్దగా మార్పులు ఏమీ లేవని, ఇవి ఏమాత్రం సరిపోవని వైట్ హౌస్ అంతర్గతంగా భావిస్తున్నట్లు సమాచారం.

వివాదాలు ఏమిటి? వెనక్కి తగ్గేదే లేదంటున్న ఇరాన్!

రాజకీయ చర్చలు జరుగుతున్నప్పటికీ, వాషింగ్టన్ – టెహ్రాన్ మధ్య ఉన్న ప్రధాన వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదు.

  • ఇరాన్ డిమాండ్లు: యురేనియం సుసంపన్నత (Uranium Enrichment) హక్కుల విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అలాగే తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, చమురు ఎగుమతులకు స్వేచ్ఛనివ్వాలని కోరుతోంది.

  • అమెరికా పట్టు: అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పర్యవేక్షణలో ఇరాన్ శాంతియుత అణు కార్యక్రమాలను మాత్రమే చేసుకోవాలని అమెరికా అంటోంది.

ఈ పరిణామాలపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. “చర్చలు జరపడం అంటే శత్రువుకు లొంగిపోవడం కాదు. తమ దేశం మరియు ప్రజల చట్టపరమైన హక్కుల విషయంలో ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదు. పూర్తి గౌరవం, అధికారంతోనే చర్చల్లో పాల్గొంటాం” అని ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *