Telangana: తెలంగాణ పల్లెల్లో మళ్లీ నాటు సారా ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక నాటు సారాను ప్రభుత్వం నిర్మూలించగా, కట్టుదిట్టంగా నిర్మూలనా చర్యలు అమలయ్యాయి. కట్టుదిట్టమైన కేసులు, సామాజిక మార్పు, రుణసహాయం కారణంగా నాటుసారా తయారీదారులు సారా తయారీకి దూరమై ఉపాధి బాటపట్టారు. మళ్లీ తాజాగా బెల్లం, పటికను పెద్ద ఎత్తున తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో మళ్లీ ఊరూరా నాటుసారా తయారీ ఆనవాళ్లు బయటపడ్డాయి.
Telangana: మహారాష్ట్ర నుంచి సిద్దిపేట, పిట్లం, జనగామ, తిరుమలగిరి, నల్లగొండ, సూర్యాపేట, తొర్రూరు ప్రాంతాలకు బెల్లం, పటికను చేరవేస్తున్న లారీని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వద్ద నల్లగొండ జిల్లా టాస్క్‌పోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ లారీలో 3,000 కిలోల బెల్లం, 100 కిలోల పటిక, 20 లీటర్ల నాటుసారాను అక్రమంగా తరలిస్తుండగా నిందితులు పట్టబడ్డారు. పైప్రాంతాల పరిధిలో నాటుసారా తయారీకి వీటిని మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్టు తమ విచారణలో తేలిందని నల్లగొండ డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ సీఐ మల్లయ్య తెలిపారు. వీటి విలువ సుమారు 3.10 లక్షలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
Telangana: నాటుసారా తయారీకి బెల్లం సరఫరాదారుడైన కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వినీత్‌పై, నాందేడ్ నుంచి బెల్లాన్ని పంపిన లారీ డ్రైవర్, క్లీనర్‌పై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. జిల్లా టాస్క్‌పోర్స్ పోలీసులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ నల్లగొండ శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్ సంతోష్, సూర్యాపేట ఈఎస్సార్ లక్ష్మణ్‌నాయక్ అభినందించారు.
Telangana: ఈ లారీ పట్టివేతతో అసలు విషయం బట్టబయలైంది. ఆయా ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారీ అవుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయిలో నిషేధం ఉన్నా లారీలో ఊరూరా బెల్లం, పటికను సరఫరా చేస్తున్న వైనం ఆందోళన కలుగుతున్నది. మరోవైపు కొందరు నేతల అండదండలతోనే ఈ వ్యవహారం గుట్టుగా నడుస్తుందని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరింతగా విచారణ జరిపితే అసలు గుట్టు బయటపడే అవకాశం ఉన్నది.