Rohini Karte 2026

Rohini Karte 2026: రోహిణి కార్తె ఎంట్రీ .. అగ్నిగుండంగా మారనున్న తెలుగు రాష్ట్రాలు.. అసలు కథ ఇప్పుడే ఉంది!

Rohini Karte 2026: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇప్పటికే అగ్నిగుండాన్ని తలపిస్తుండగా, సామాన్య జనానికి మరింత వణుకు పుట్టించే వార్త ఇది. వేసవి కాలంలోనే అత్యంత భయంకరమైన ఎండలు ఉండే “రోహిణి కార్తె” సోమవారం నుంచే ప్రారంభమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడంతో జూన్ 8వ తేదీ వరకు ఈ నిప్పుల కొలిమి తప్పదని పండితులు చెబుతున్నారు. ఈ పక్షం రోజుల పాటు ఎండ తీవ్రత గరిష్ట స్థాయికి చేరి, ఆ తర్వాత కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతుంది.

సాధారణంగానే “రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి” అనే సామెత ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ కాలంలో సూర్య భగవానుడు భగభగ మండిపోతూ ఉంటాడు. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా, మధ్యాహ్నానికి బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 48 డిగ్రీలు దాటేసిన ఎండలు, ఇప్పుడు రోహిణి కార్తె ప్రభావంతో 49 లేదా 50 డిగ్రీల మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో అత్యధికంగా 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతాల్లో 48.1 డిగ్రీలు రికార్డయింది. రాష్ట్రంలోని దాదాపు 17 జిల్లాల్లోని 174 మండలాల్లో ఎండలు 44 డిగ్రీలు దాటేశాయి. మరో నాలుగైదు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇటు తెలంగాణలో కూడా పరిస్థితి ఏమీ బాగులేదు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ పారద 45 డిగ్రీలకు పైనే చూపిస్తోంది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు ప్రజలను కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *