Gautam Gambhir: టీమిండియా కోచ్ గౌతం గంభీర్ కు బిజిటి సిరీస్ అగ్ని పరీక్షగా మారింది. వరుసగా ఆసీస్ గడ్డపై రెండు సిరీస్ లు గెలిచిన టీమిండియా ఇప్పుడు వరుసగా మూడో సిరీస్ విజయం సాధించాలని కోరుకుంటోంది. అంతేకాదు
ఇక్కడ విజయం సాధిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ దక్కుతుంది. కివీస్ తో వైట్ వాష్ తో అతనిపై విమర్శల వర్షం కురవగా.. ఇప్పుడు ఆసీస్ గడ్డపై సిరీస్ విజయం అందకపోతే అతడి పదవికే చేటు వచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.
భారత కోచ్ అంటే రవిశాస్త్రిలా ఉండాలా..? లేదంటే అనిల్ కుంబ్లేలా ఉండాలా..? అదీ కాదంటే రాహుల్ ద్రవిడ్ లా ఉండాలా…? మరి ఎలా ఉంటే ఆటగాళ్లకు నచ్చుతుందో ఫలితాలు చూస్తే తెలుస్తుంది.. రవిశాస్త్రిలా మరీ ప్లేబాయ్ లా ఉన్నా అద్భుత ఫలితాలు అందించాడు. ఇక రాహుల్ ద్రవిడ్ సైతం తనదైన స్టైల్ తో టీ20 ప్రపంచకప్ అందించాడు.ఎన్నో సిరీస్ విక్టరీలు అందించాడు. అలాగే అనిల్ కుంబ్లే కూడా విజయాలు అందించినా కోహ్లీతో సరిపడక..ఆటగాళ్లు అతని క్రమశిక్షణకు వ్యతిరేకంగా మారడంతో కోచ్ గా ముందే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు గౌతం గంభీర్ హయాంలో కూడా ఏదో జరుగుతుందన్నది ఫ్యాన్స్ కు అనుమానంగా మారింది.
Gautam Gambhir: అతను ఎవరితోనూ కలవడు. ముక్కుసూటిగా ఉంటాడు. సీనియర్లూ తన మాటే వినాలని కోరుకుంటాడు.. ఇవీ గౌతమ్ గంభీర్ చీఫ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వస్తున్న వ్యాఖ్యలు. అనిల్ కుంబ్లేలా స్కూల్ హెడ్ మాస్టర్ ను తలపిస్తూ ..జట్టులో కర్రపెత్తనం కావాలని కోరుకుంటున్నట్లుగా అతని ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ తొ వైట్ వాష్ తో విమర్శల పదును మరింత పెరిగింది. దీంతో ఇప్పుడు జరగనున్న ఆసీస్ పర్యటన కోచ్ గా అతడి భవితవ్యానికి కీలకంగా మారింది.
ఆటపై అత్యంత నిబద్ధత కలిగిన ప్లేయర్ గౌతమ్ గంభీర్. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. జట్టు విజయం కోసం చివరివరకూ పోరాడేతత్వం కలిగిన ఆటగాడు అతను. అలాంటి వ్యక్తికి ప్రధాన కోచ్ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పే గంభీర్ ఈ పాత్రను ఎలా పోషిస్తాడనే సందిగ్ధం ఉండేది. కానీ సీనియర్, జూనియర్లతో గంభీర్ కలిసిపోయాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లిన అతడికి వన్డే సిరీస్ లో ఓటమి..టీ20 సిరీస్ లో విజయంతో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడే కదా బాధ్యతలు తీసుకుంది.. కాస్త సమయం పడుతుందిలే అని అందరూ భావించారు. మన గడ్డపై బంగ్లాదేశ్‌ను టీమిండియా చిత్తు చేయడంతో గంభీర్‌కు తిరుగులేకుండా పోయింది. మరీ ముఖ్యంగా రెండో టెస్టులో వర్షం కారణంగా కేవలం రెండున్నర రోజుల్లోనే ఫలితం రాబట్టాల్సిన తరుణంలో ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అనుకున్నట్లుగానే భారత్ విజయం సాధించింది. దీంతో టెస్టు క్రికెట్ లో బజ్‌బాల్‌కు పోటీగా గమ్ బాల్ అంటూ కొత్త పదం వాడుకలోకి వచ్చింది.
అంతా బాగుంది.. భారత్ టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు మూడోసారి దూసుకుపోవడం ఖాయమని భావించిన వేళ.. పెద్ద షాక్ తగిలింది. స్వదేశంలో స్పిన్‌తో ప్రత్యర్థులను ఆటాడేస్తామని అనుకుంటే.. ఆ ఉచ్చుకే భారత ప్లేయర్లు దొరికిపోయారు. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను వైట్‌వాష్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్పిన్ ట్రాక్‌లపై టీమిండియా బ్యాటర్లు తేలిపోవడం కలవరానికి గురిచేసింది. అప్పటివరకూ ఉన్న డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఆశలకు గండి పడినట్లైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం భారత్‌ను తీవ్రంగా దెబ్బకొడుతోంది.దీంతో సహజంగానే ఆసీస్ లో జరగనున్న బిజిటి సిరీస్ భారత జట్టు తలరాతను మార్చనుంది.
ఇది కూడా చదవండి: Womens Asian Champions Trophy 2024: ఆసియా చాంపియన్స్ హాకీ ఫైనల్లో భారత్
Gautam Gambhir: జట్టులోని నలుగురు సీనియర్ ఆటగాళ్లు సహా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తును నిర్ణయించనుంది. స్వదేశంలో కివీస్ చేతిలో ఘోర ఓటమితో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు రేగాయి. ఈ పదవికి తగినవాడు కాదన్న వ్యాఖ్యలూ వినిపించాయి. ఇప్పుడు ఆసీస్ గడ్డపై బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో విజయం సాధించలేకపోతే గంభీర్ పని అయిపోయినట్లే అంటున్నారు. ఎందుకంటే వరుసగా రెండుసార్లు ఆసీస్ గడ్డపై టీమిండియా సిరీస్ విజయాలు సాధించింది. ఇప్పుడు మరోసారి టీమ్‌ఇండియా బిజిటి సిరీస్ కైవసం చేసుకుంటే హ్యాట్రిక్ కొట్టడంతోపాటు కోచ్ గా గంభీర్‌పై వస్తున్న అపవాదు తొలగిపోయే ఛాన్స్ ఉంది.
ఇక కఠిన నిర్ణయాలకు గంభీర్ సిద్ధమేనా…? ఆడకోపోతే ఎంతటి స్టార్ ప్లేయర్ నైనా ఇంటికి పంపిస్తాడా ? అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఒకరిద్దరు మినహా బ్యాటింగ్ విభాగం మొత్తం ఫెయిలైంది. ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి వికెట్ పారేసుకోవడం.. స్పిన్‌ను ఆడడంలో కోహ్లీ బలహీనత బయటపడటం ఆందోళన కలిగించే అంశాలు. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో అత్యంత కీలకం వీరిద్దరే కావడంతో తొలిటెస్టుకు రోహిత్ అందుబాటులో లేకపోవడం.. గిల్ కు గాయం..రాహుల్ ఫాంలో లేకపోవడంతో ఇప్పుడు తొలి టెస్టులో ఓపెనర్, వన్‌డౌన్ ఆర్డర్‌లో వచ్చే ప్లేయర్లు ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
మ్యాచ్‌ను గెలవాలంటే ఒకరిద్దరు ఆడితే సరిపోతుంది.. కానీ, సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే మాత్రం జట్టు కలిసికట్టుగా రాణించాలి. ఇదే సూత్రాన్ని ఆసీస్‌తో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో గంభీర్ అమలుచేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వరుసగా విఫలమైనప్పటికీ చూసీచూడనట్లుగా ప్లేయర్లను ఆడిస్తూ వచ్చినా ఇకనుంచి కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా జట్టును ఎంపిక చేయదు అని అంటున్న గంభీర్ ఆటగాళ్లపై కూడా అంతే కటువుగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. లేకపోతే విమర్శకులు అంటున్నవిధంగా అతడి పదవికే చేటు వచ్చే అవకాశం లేకపోలేదు.
Gautam Gambhir: ఇప్పటివరకు టీమిండియాకు గ్యారీ కిరిస్టెన్, జాన్ రైట్ వంటి విదేశీ కోచ్‌లు కూడా జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించారు. ఆ తర్వాత భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా వచ్చాక కుర్రాళ్లకు స్వేచ్ఛ ఇచ్చాడు. తొలిసారి విదేశీ గడ్డపై టీమ్‌ఇండియా ఆధిపత్యం ప్రదర్శించేలా చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇంగ్లండ్, ఆసీస్‌లో టెస్టు విజయాలను భారత్ సాధించింది. అదే వారసత్వాన్ని రాహుల్ ద్రవిడ్ కొనసాగించాడు. ఆస్ట్రేలియాపై అక్కడే మరోసారి విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన తర్వాత కోచ్ పదవి నుంచి వెళ్లిపోయిన ద్రవిడ్ బాటలోకి గంభీర్ వచ్చాడు. 2007 టీ20 ప్రపంచకప్ , 2011 వరల్డ్ కప్‌లను గెలుచుకోవడంలో బ్యాటింగ్ లో కెప్టెన్ ధోనీతోపాటు గౌతమ్ గంభీర్‌దీ కీలక పాత్రే. ఇప్పుడు కోచ్‌గా వచ్చిన అతడిముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ , ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచకప్ 2026, వన్డే ప్రపంచకప్ 2027 మెగా టోర్నీలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ కోచ్‌గా భారత్‌కు మార్గదర్శం చేయాలంటే గంభీర్ ముందు ప్రస్తుత ఆసీస్ గండం నుంచి గట్టెక్కాల్సి ఉంటుంది. అప్పుడే విజయవంతమైన కోచ్ గా తన ప్రస్థానం సాఫీగా సాగుతుంది.