Kurnool Mayor Chair

Kurnool Mayor Chair: మేయర్‌ పీఠం కోసం వ్యూహం

Kurnool Mayor Chair: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 52 డివిజన్లలో… కర్నూలు నియోజకవర్గంలో 33, పాణ్యం నియోజకవర్గ పరిధిలో 16, కోడుమూరు నియోజకవర్గ పరిధిలో 3 డివిజన్లు ఉన్నాయి. 2021 మార్చిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ 43 వార్డుల్లో విజయం సాధిస్తే.. టీడీపీ అభ్యర్థులు 6 వార్డులు గెలుచుకుంది. ఆ పార్టీ మద్దతుతో విజయం సాధించిన ముగ్గురు స్వతంత్రులతో కలిపి టీడీపీ బలం 9 మంది కార్పొరేటర్లే.

19వ డివిజన్‌ కార్పొరేటర్‌ బీవై రామయ్య మేయర్‌గా, ఎస్‌.రేణుక, ఎన్‌.అరుణ డిప్యూటీ మేయర్లుగా బాధ్యతలు స్వీకరించారు. రామయ్య మేయర్‌గా ఎన్నికైనప్పటి నుంచి తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు వైసీపీ కార్పొ రేటర్లు అసంతృప్తితో రగిలిపోతున్నా.. వైసీపీ అధికారంలో ఉండడంతో బయటపడలేదు. కానీ 2024 జూన్‌ 12న టీడీపీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ నాటి నుండి ఒక్కొక్కరుగా వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరుతూ వచ్చారు.

కర్నూలు నగరపాలక సంస్థలో టీడీపీ కూటమి క్రమంగా తన సంఖ్యాబలం పెంచుకుంటూ మేయర్ పీఠంపై కన్నేసింది. 52 మంది కార్పొరేటర్లు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి.. ఓటు హక్కు కలిగిన సభ్యుల సంఖ్య 56. అయితే కార్పొరేటర్లలో ఒకరు ఓ కేసులో శిక్ష అనుభవిస్తూ జిల్లా జైలులో ఉన్నారు. ఆయన ఓటు హక్కు కోల్పోతే.. మిగిలింది 55 మంది. అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్‌ను పదవి నుంచి దింపాలంటే 28 మంది సభ్యుల బలం ఉండాలి. టీడీపీ కార్పొరేటర్లు 9 మంది ఉంటే.. మరో 11 మంది వైసీపీ కార్పొరేటర్లు ఇప్పటికే అధికారికంగా టీడీపీలో చేరారు.

Kurnool Mayor Chair: నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యుల బలం కలుపుకుంటే టీడీపీ సభ్యుల సంఖ్యా బలం 24కు చేరుతుంది. మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే మరో నలుగురు సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. అయితే.. ఇప్పటికే ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ నాయకులకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు టీడీపీలో చేరినా, అవిశ్వాస తీర్మానం రోజున మద్దతు ఇచ్చినా మేయర్‌కుపదవీ గండం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Also Read: Vemireddy: వేమిరెడ్డి దంపతుల విలక్షణత

మేయర్‌ పీఠం కోసం ఓ వైపు కూటమి నాయకులు వ్యూహాత్మక పావులు కదుపుతోంటే.. ఎలాగైనా పీఠం చేజారకుండా చూడాలని వైసీపీ ముఖ్య నాయకులు పావులు కదుపుతున్నారు. టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారనుకుంటున్న వైసీపీ కార్పొరేటర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, నాయకులు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. వైసీపీలో మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. వాటిని ఆసరాగా చేసుకుని టిడిపి పక్కా ప్లాన్‌తో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ALSO READ  Nellore: కొండేపాటి గంగా ప్రసాద్ క్రేజ్... న్యూ ఇయర్‌లో జాతర

ఇటు మేయర్‌గా రామయ్య పదవికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. దీంతో మేయర్‌పై అవిశ్వాసానికి టిడిపి సిద్ధం అయినట్లు సమాచారం. ఒక్క ఏడాది అయినా మేయర్ పీఠంపై టిడిపి జెండా ఎగుర వేయాలని ఆ పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరి టీడీపీ కల నెరవేరుతుందో, లేదో.. కాలమే సమాధానం చెప్పాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *