Telangana assembly:బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శాసనసభా పక్షం తీవ్రంగా పరిగణించింది. కేటీఆర్‌కు భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం నాటి (మార్చి 26) సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
Telangana assembly:బుధవారం జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ బయట సమాజంలో 30 పర్సెంట్ కమిషన్ అని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారని, 20 పర్సెంట్ కమిషన్ అని సెక్రటేరియట్ ఎదుట ధర్నాలు చేశారని పేర్కొన్నారు. తాము ఈ విషయాలను అనలేదని తేల్చిచెప్పారు. మంత్రులు కాస్త సంయమనంతో మాట్లాడాలి అని హితవు పలికారు.
Telangana assembly:ఆ తర్వాత మాట్లాడిన భట్టి విక్రమార్క కాస్త కటువుగానే మాట్లాడారు. సభ్యులు మాట్లాడేటప్పుడు ఒళ్లు దొగ్గర పెట్టుకొని మాట్లాడాలి అంటూ హెచ్చరిక ధోరణితో మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ప్రతిగా అధికార పక్ష సభ్యులు కూడా ప్రతివాదనకు దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆరోపణలు చేశారు.
Telangana assembly:అనుచిత వ్యాఖ్యలు చేసిన భట్టి విక్రమార్క తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. సభలో నినాదాలు చేశారు. కేటీఆర్ ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దీంతో అధికార పక్షం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు సభను వాకౌట్ చేశారు. అసెంబ్లీ గేటు ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ, నినాదాలు చేశారు.