Crime News

Crime News: మూడేళ్ల పసికందుపై బిస్కెట్ ఆశ చూపి అఘాయిత్యం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి..!

Crime News:కామంతో కళ్లు మూసుకుపోయి మనుషులు మృగాలుగా మారుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. తమిళనాడులో మూడేళ్ల పసిమొగ్గపై జరిగిన అమానుష అత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కామాంధుడి చేతిలో చితికిపోయిన ఆ చిన్నారి.. ఆసుపత్రిలో మరణపోరాటం చేస్తూ చివరకు ప్రాణాలు కోల్పోయింది.

బిస్కెట్ ఆశ చూపి పొదల్లోకి..!

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక తల్లిదండ్రులు బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు. వీరు బతుకుదెరువు కోసం తమిళనాడులోని గుమ్మిడిపూండి పరిధిలో గల ‘సిప్‌కాట్’ (SIPCOT) పారిశ్రామిక ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నిందితుడు కూడా అదే ప్రాంతానికి చెందిన బీహార్ వలస కూలీగా గుర్తించారు.

శనివారం ఆ చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా, చిన్నారికి బాగా తెలిసిన నిందితుడు బిస్కట్ ఇస్తానని ఆశ చూపి నమ్మించి వెంట తీసుకెళ్లాడు. ఆపై నిర్మానుష్యంగా ఉన్న ఒక పొదల్లోకి లాక్కెళ్లి పసికందు అని కూడా చూడకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆ బుజ్జాయిని అక్కడే వదిలేసి పారిపోయాడు.

ఆ సమయంలో బహిర్భూమికి(మలమూత్ర విసర్జన) వెళ్లిన ఒక స్థానిక మహిళ.. పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గమనించింది. వెంటనే బాలిక శరీరాన్ని శుభ్రం చేసి, పరిస్థితి విషమంగా ఉందని గ్రహించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వెంటనే ఆ చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ ఆదివారం ఆ పసిమొగ్గ ప్రాణాలు కోల్పోయింది.

మృగాడికి దేహశుద్ధి.. గ్యాంగ్ రేప్ ప్రచారం ఖండన:

ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడిని గమనించిన స్థానికులు తీవ్ర ఆగ్రహంతో అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు.

తీవ్ర కోపంలో ఉన్న జనం.. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉండొచ్చనే అనుమానంతో మరికొంతమంది అనుమానితులపై కూడా దాడికి యత్నించారు. అయితే పోలీసులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. “ఇది గ్యాంగ్ రేప్ కేసు కాదు. ఇందులో కేవలం ఒక్కడే నిందితుడు ఉన్నాడు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు” అని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. తొలుత ఈ కేసును పోక్సో (POCSO) చట్టం కింద నమోదు చేసిన పోలీసులు.. బాలిక మరణానంతరం ఇందులో హత్య సెక్షన్లను కూడా చేర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *