Vijay Gold Ring: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో కీలక హామీని నెరవేర్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ప్రతి నవజాత శిశువుకూ ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహూకరించే ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం విజయ్ స్వయంగా పసిబిడ్డలను ఎత్తుకుని, వారి చిట్టి చేతులకు బంగారు ఉంగరాలను తొడిగారు. తమిళ సంప్రదాయంలో మేనమామ నవజాత శిశువులకు బంగారు ఉంగరం కానుకగా ఇవ్వడం ఆనవాయితీ కాగా, అదే సెంటిమెంట్‌ను ప్రతిబింబించేలా ఈ పథకానికి ‘థాయ్‌మామన్ తంగ మొతిరమ్ థిట్టమ్’ (మేనమామ ఇచ్చే బంగారు ఉంగరం పథకం) అని పేరు పెట్టారు.
రూ.755.83 కోట్ల బడ్జెట్ – 22 క్యారెట్ల నాణ్యమైన బంగారం:
ఈ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏకంగా రూ.755.83 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి బిడ్డకు 1 గ్రాము బరువు గల 22 క్యారెట్ల నాణ్యమైన బంగారు ఉంగరాన్ని అందజేస్తున్నారు. నాణ్యతలో ఎలాంటి లోపాలు జరగకుండా ప్రతి ఉంగరానికి ప్రత్యేక సీరియల్ నంబర్‌తో కూడిన ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌ను సిద్ధం చేశారు.
పథకం ప్రారంభం నాటికే ప్రభుత్వం 1.28 లక్షల బంగారు ఉంగరాలను సిద్ధం చేసింది. జూన్ 22 నుంచి జన్మించిన ప్రతి చిన్నారికీ ఈ పథకం వర్తిస్తుంది. పెండింగ్ రిజిస్ట్రేషన్లు, పంపిణీ పూర్తి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 107 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రోజుకు సుమారు 100 మంది శిశువులకు ఉంగరాలను అందజేస్తారు. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందే తల్లీబిడ్డలకు ఈ ఉంగరాన్ని అందజేస్తారు.
పథకం లక్ష్యాలు & అర్హతలు:
-
లక్ష్యం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించడం, పేద మహిళలకు సురక్షిత వైద్య సేవలు అందించడం, శిశు సంరక్షణను మెరుగుపరచడం మరియు మాతృత్వానికి గౌరవం కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
-
అర్హత నిబంధనలు:
-
లబ్ధిదారులు తమిళనాడు స్థానిక నివాసితులై ఉండాలి.
-
గర్భధారణ, శిశు సంరక్షణ పర్యవేక్షణ వ్యవస్థ కింద పేర్లను నమోదు చేసుకుని, తప్పనిసరిగా ‘ఆర్‌సీహెచ్ ఐడీ’ (RCH ID) కలిగి ఉండాలి.
-
ప్రభుత్వ పరిధిలోని ఏ ఆసుపత్రిలో ప్రసవం జరిగినా ఈ పథకం వర్తిస్తుంది.
-
-
ఎన్నికల కోడ్ మినహాయింపు: అసెంబ్లీ ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెంగల్పట్టు, తిరుపూర్ జిల్లాలను ప్రస్తుతానికి తాత్కాలికంగా మినహాయించారు.
-
గాంధీ మెమోరియల్ మ్యూజియం ప్రారంభం..
బంగారు ఉంగరాల పంపిణీ అనంతరం సీఎం విజయ్ మదురైలో పునరుద్ధరించిన గాంధీ మెమోరియల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ జీవిత ప్రయాణంలో కీలక ఘట్టాలను వివరించే అరుదైన ఛాయాచిత్రాలు, ఆయన స్వదస్తూరితో రాసిన లేఖలు, గాంధీజీ ఉపయోగించిన వస్తువుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. మదురై నగరంతో మహాత్ముడికి ఉన్న చారిత్రక అనుబంధాన్ని ఈ సందర్భంగా విజయ్ గుర్తు చేసుకున్నారు.
