1. ఎల్పీజీ సబ్సిడీకి బయోమెట్రిక్ ఈ-కేవైసీ (E-KYC) తప్పనిసరి
రాయితీ పొందాలంటే వెరిఫికేషన్ కంపల్సరీ..
డొమెస్టిక్ ఎల్పీజీ (LPG) వినియోగదారులు సబ్సిడీ ధరకే గ్యాస్ సిలిండర్ పొందాలంటే బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణను పూర్తి చేయాల్సిందే. సెప్టెంబర్ నెలాఖరుతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియనుంది. ఈ-కేవైసీ చేయని ఖాతాదారుల గ్యాస్ కనెక్షన్ రద్దవదు. కాకపోతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఖాతాల్లో జమకాదు; వారు మార్కెట్ పూర్తి ధరకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఎక్కడ పూర్తి చేసుకోవాలి?..
ఇప్పటికే దాదాపు 90 శాతం మంది ఈ ప్రక్రియను ముగించారు. మిగిలిన వారు సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద, సంబంధిత గ్యాస్ ఏజెన్సీ షోరూమ్‌లలో లేదా ఆయిల్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా ఈ ధ్రువీకరణను ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రతి నెలా 1వ తేదీ మాదిరిగానే అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరల ఆధారంగా వాణిజ్య (కమర్షియల్), గృహ అవసరాల సిలిండర్ ధరలను చమురు సంస్థలు సవరించే అవకాశం ఉంది.
2. ఫిక్సెడ్ డిపాజిట్లపై (FD) ఆర్బీఐ పారదర్శక నిబంధనలు
బ్యాంకు డిపాజిట్లలో ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను అమలులోకి తెస్తోంది.
అందరికీ సమాన వడ్డీ రేటు..
ఒకే తేదీన, ఒకే మొత్తంలో డిపాజిట్ చేసే ఖాతాదారులందరికీ అన్ని బ్రాంచుల్లో ఒకే రకమైన వడ్డీ రేట్లను అందించాలి. కస్టమర్ల స్థాయిని బట్టి లేదా బ్రాంచీలను బట్టి చర్చల ద్వారా ఇష్టానుసారంగా వడ్డీ రేట్లను నిర్ణయించడానికి వీలు లేదు.
వెబ్సైట్లో ముందస్తు షెడ్యూల్:
రూ.3 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్ల వివరాలను బ్యాంకులు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకల్లా తమ అధికారిక వెబ్సైట్లలో పబ్లిష్ చేయాల్సి ఉంటుంది.
3. ఆలస్యంగా జనన, మరణాల రిజిస్ట్రేషన్లపై కఠిన నిబంధనలు
తప్పుడు రికార్డులను, నకిలీ ధ్రువపత్రాలను నివారించేందుకు జనన, మరణాల రిజిస్ట్రేషన్ గడువు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. జననం లేదా మరణం సంభవించి ఏడాది దాటి, రెండేళ్ల లోపు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే కచ్చితమైన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే అనుమతిస్తారు. ఒక్కవేల రెండేళ్లు దాటిన తర్వాత దరఖాస్తు చేసుకునే రిజిస్ట్రేషన్లకు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (Judicial Magistrate First Class) ఉత్తర్వులు తప్పనిసరిగా ఉండాలి.
4. అక్టోబర్ 15 నుంచి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) చార్జీలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిబంధనల ప్రకారం, వ్యక్తి నుంచి వ్యాపారులకు (P2M) చేసే రూ.2,000 పైబడిన లావాదేవీలపై 0.4% మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమల్లోకి రానుంది (గరిష్ఠ పరిమితి రూ.300).
ఈ ఛార్జీలు పూర్తిగా వ్యాపారులు (మర్చంట్లు) డిజిటల్ నెట్‌వర్క్‌కు చెల్లించాల్సినవే తప్ప వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయడానికి అనుమతి లేదు. సాధారణ పర్సన్ టు పర్సన్ (P2P) చెల్లింపులు, రూ.2,000 లోపు సాధారణ చెల్లింపులకు పూర్తి మినహాయింపు ఉంది. పెట్రోల్ పంపులు, ఇన్సూరెన్స్ వంటి లావాదేవీలకు రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ వర్తిస్తుంది.