Stree Ride: మహిళలు సొంత కాళ్లపై నిలబడటంతో పాటు సమాజంలో వారికి మరింత భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విమెన్ సేఫ్టీ వింగ్, రాష్ట్ర రవాణా శాఖ కలిసి సంయుక్తంగా ‘స్త్రీ రైడ్’ అనే కొత్త ప్రాజెక్టును తీసుకువచ్చాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్ లైన్స్‌లో ఈ ప్రాజెక్టును రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ గారు జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. మహిళలు రవాణా, డెలివరీ రంగాలలో ఉపాధి పొందేలా ప్రోత్సహించడానికి ఈ-బైక్స్, ఈ-ఆటోలను వారికి అందించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలో 55 మంది మహిళలకు ‘స్త్రీ రైడర్లు’గా అవకాశం కల్పించారు. వీరందరికీ అంబర్‌పేట పోలీస్ లైన్స్‌లోనే టూ వీలర్, త్రీ వీలర్ నడపడంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఈ 55 మంది మహిళలకు డీజీపీ చేతుల మీదుగా డ్రైవింగ్ లైసెన్సులు కూడా అందజేశారు. అత్యవసర సమయాల్లో ప్రయాణించే ఇతర మహిళలకు సురక్షితమైన రవాణా సేవలు అందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడనుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జొమాటో, స్విగ్గీ వంటి డెలివరీ సర్వీసుల్లో కూడా మహిళలు భాగస్వాములు కావడంపై డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే నాలుగు నెలల్లో ఈ మహిళా రైడర్ల సంఖ్యను మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మహిళల ఉపాధికి, వారి ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
