Viral News

Viral News: గన్ గురిపెట్టి యువకుడు, తండ్రి, ఫ్రెండ్‌ను నగ్నంగా నడిపించిన వైనం.. ముగ్గురు అరెస్ట్!

Viral News: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో అత్యంత అమానవీయమైన ఘటన వెలుగుచూసింది. పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టి.. ‘బట్టలు విప్పి నడుస్తారా లేక ఇక్కడే కాల్చిపారేయమంటారా?’ అంటూ బెదిరించి ఓ యువకుడు, అతడి తండ్రి, స్నేహితుడిని వీధిలో నగ్నంగా ఊరేగించిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతా పరిధిలోని బెహాలా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు తన స్నేహితుడితో కలిసి తనకు తెలిసిన 13 ఏళ్ల బాలికను కలిశాడు. ఆ సమయంలో వారిద్దరూ ముద్దు పెట్టుకోవడాన్ని బాలిక బంధువు గమనించాడు. వెంటనే ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చేరవేయడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. యువకుడితో పాటు అతడి స్నేహితుడిని బలవంతంగా ఖుదిరాంపల్లిలోని తమ ఇంటికి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇంట్లో వారిని బంధించి విచక్షణారహితంగా దాడి చేసి, ఆ యువకుడి తండ్రికి ఫోన్ చేయించి అక్కడికి రప్పించారు.
తండ్రి అక్కడికి చేరుకోగానే ఆయనపై కూడా దాడికి దిగారు. అనంతరం ఆ ముగ్గురిపై పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ ఎక్కుపెట్టి, బట్టలు తీసేసి నడవకపోతే కాల్చేస్తామని బెదిరించారు. ప్రాణభయంతో వారు బట్టలు విప్పేయగా, ఇంటి బయట వీధిలో దాదాపు 50 మీటర్ల దూరం ముగ్గురినీ నగ్నంగా నడిపించి పైశాచికానందం పొందారు.
ఈ దారుణ దృశ్యాలు బయటకు వచ్చి వైరల్ కావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద హత్యాయత్నం, అక్రమ నిర్బంధం, కిడ్నాప్, ప్రాణాంతక ఆయుధాలతో దాడి చేయడం, బెదిరింపుల వంటి పలు తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి బాలిక తల్లిదండ్రులతో పాటు ఆమె మామను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టడంతో పాటు, నేరానికి ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకునేందుకు సీసీటీవీ విజువల్స్ ఆధారంగా లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *