Akhanda 2: బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ సినిమాతో ఆరంభం అయిన బాలయ్య జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఆ తర్వాత వచ్చిన ‘వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి’తో పాటు తాజాగా విడుదలైన ‘డాకూ మహారాజ్’ సైతం విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో బాలయ్య ‘అఖండ2’ షూట్ కి రెడీ అవుతున్నాడు. ఇటీవల ఆరంభమైన మహా కుంభమేళాలో యూనిట్ షూటింగ్ జరుపుతోంది. కుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అఘోరగా బాలకృష్ణ నటించబోతున్నఈ సినిమాకు మహాకుంభమేళా విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు. సనాతన ధర్మంను చాటిచెప్పేలా ఈ సినిమా ఉంటుందని యూనిట్ చెబుతోంది. అందుకు కుంభమేళా సరిగ్గా కలసి వచ్చిందని, బాలకృష్ణ సైతం రెండు రోజుల పాటు అక్కడ షూట్ లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే సినిమాకు అద్బుతమైన విజువల్స్ దొరికినట్లుగా భావించవచ్చు. మరి ఈ షూట్ కి సంబంధించిన విజువల్స్ ను యూనిట్ ఎప్పుడు విడుదల చేస్తుందో చూడాలి.