Revanth Reddy: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చూపిన బాటలో నడిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
గాంధీజీ, అంబేడ్కర్ ఇద్దరూ దేశానికి రెండు కళ్లు లాంటివారని రేవంత్ రెడ్డి కొనియాడారు. హింస లేకుండా శాంతితో విజయం సాధించవచ్చని గాంధీజీ నిరూపిస్తే, చట్టం మరియు సమానత్వంతో దేశాన్ని ఎలా బలోపేతం చేయాలో అంబేడ్కర్ నేర్పించారని అన్నారు. పేద ప్రజల కలలను నిజం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ముఖ్యంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేద పిల్లలకు నాణ్యమైన చదువు అందించేందుకు ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఊరికో పబ్లిక్ స్కూల్ లేదా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ద్వారా గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును మార్చబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే, గత ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు చేశారు. గడిచిన పదేళ్లలో జరిగిన పాలన రాష్ట్రానికి వందేళ్ల నష్టాన్ని మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసాన్ని, చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
