Sharon Raj murder case: 2022లో కేరళలో సంచలనం సృష్టించిన 23 ఏళ్ల రేడియాలజీ విద్యార్థి షారన్ రాజ్ హత్య కేసులో కేరళ కోర్టు గ్రీష్మా, ఆమె మామ నిర్మల కుమారన్ నాయర్‌లను దోషులుగా నిర్ధారించింది. నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు జనవరి 17న తీర్పు ఇచ్చింది. ఈ కేసులో గ్రీష్మ తల్లి సింధుపై తగిన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదల చేసింది. న్యాయమూర్తి ఎ.ఎం బషీర్ ఈ కేసులో జనవరి 19న శిక్షల పరిమాణాన్ని ప్రకటించనున్నారు. హత్య, హానికరమైన పదార్థాలు ఉపయోగించి ఒక వ్యక్తికి హాని కలిగించడం, సాక్ష్యాలు నాశనం చేయడం, హత్య మరియు కిడ్నాప్ సెక్షన్ల కింద గ్రీష్మని, ఆమె మామని దోషులుగా ప్రకటించారు. అయితే, ఈ కేసులో గ్రీష్మ తల్లి సింధు నిర్దోషిగా విడుదల కావడంపై రాజు కుటుంబీకులు నిరాశ వ్యక్తం చేశారు. కేరళ హైకోర్టులో అప్పీలు దాఖలు చేస్తామని చెప్పారు.
కేరళ, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. అక్టోబర్ 14, 2022న, షారోన్ తన స్నేహితుడు రెజిన్‌లో కలిసి కన్యాకుమారిలోని రామవర్మంచిరైలోని గ్రీష్మా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో గ్రీష్మా పురుగుల మందు కలిపిన ఆయుర్వేద కషాయాన్ని అతడికి ఇచ్చింది. అయితే, క్షణాల్లోనే షారోన్ వాంతులతో ఆస్పత్రిలో చేరాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన తర్వాత షారోన్ పరిస్థితి మెరుగైనట్లు కనిపించింది.
అయితే, అతను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్యం వేగంగా క్షీణించింది. అక్టోబర్ 17న తిరువనంతపుర మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరాడు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి కారణమయ్యే యాసిడ్‌ని తీసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. రోజుల తరబడి డయాలసిస్, ఇతర చికిత్సలు చేసిన తర్వాత, అక్టోబర్ 25న షారోన్ గుండెపోటుతో మరణించాడు. గ్రీష్మా ఇచ్చిన కషాయం తాగిన తర్వాత షారోన్ కనీసం నీరు కూడా తాగలేకపోయే స్థితికి చేరి మరణించడం విషాదం.
షారోన్ అనారోగ్య విషయంలో, అతడి కుటుంబానికి అనుమానాలు పెరిగాయి. గ్రీష్మ ఇచ్చిన కషాయం చుట్టూ పోలీసులు విచారణ జరిపారు. షారోన్ కూడా తన మరణ వాంగ్మూలంలో గ్రీష్మ ఇచ్చిన పదార్థం తీసుకున్న తర్వాతే తనకు ఇలా జరిగిందని చివరకు చెప్పాడు. మొత్తంగా ఒక ప్రేమ కథ ద్రోహం, మోసం, విషాదంగా మారింది.