Sai Krishna Case: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో నమ్మశక్యం కాని, విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ భవనం టెర్రస్‌పై జరిపిన తనిఖీల్లో కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకుంది. అనుమానాస్పద మరకలతో ఉన్న ఒక పోలీస్ లాఠీతో పాటు మానవ ఎముకలు, బూడిద, ఒక స్టీల్ బ్రేస్‌లెట్ ఇంకా కొన్ని ఇతర వస్తువులను సిట్ అధికారులు కనుగొన్నారు. న్యాయాధికారి సమక్షంలో ఈ సాక్ష్యాలన్నింటినీ సీజ్ చేసి, తదుపరి ఫోరెన్సిక్ విశ్లేషణల కోసం ల్యాబొరేటరీకి పంపించారు. ప్రాథమికంగా ఇవి లాకప్ డెత్‌కు గురైనట్లు భావిస్తున్న సాయికృష్ణకు చెందిన అవశేషాలుగానే అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ కీలక ఆధారాలను సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌లో సైతం సిట్ కోర్టు ముందు ఉంచింది.
ఈ కేసులో క్లూస్ టీమ్ ఇంకా ఫోరెన్సిక్ నిపుణులు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ను అంగుళం అంగుళం జల్లెడ పట్టారు. లాకప్ గదులు, గోడలు అలాగే స్టేషన్ ఆవరణలోని పలు ప్రాంతాల నుండి అనుమానాస్పద రక్తపు మరకల నమూనాలను సేకరించారు. అయితే, సాయికృష్ణ మృతదేహాన్ని స్టేషన్ నుండి బయటకు తరలించి దహనం చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న తరుణంలో.. మళ్లీ ఈ ఎముకలు, బూడిద పోలీస్‌స్టేషన్ టెర్రస్‌పైకి ఎలా వచ్చాయి? ఒకవేళ నిందితులే వాటిని వెనక్కి తెచ్చి ఉంటే, భవనం పైకప్పు పైనే ఎందుకు దాచారు? లాఠీపై ఉన్న ఆ మరకలు ఎవరివి? వంటి అనేక చిక్కుముడులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇప్పటికే సాయికృష్ణను థర్డ్ డిగ్రీతో తీవ్రంగా కొట్టడం వల్లే కస్టడీలోనే మరణించాడని నిందితుల రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టం చేసింది. ఇప్పుడు శవం ఆచూకీ దొరకని ఈ మిస్టరీ కేసులో తాజాగా లభించిన ఈ వస్తువులు దర్యాప్తును మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది.
ఈ మిస్టరీని ఛేదించేందుకు సిట్ అధికారులు ఇప్పుడు డీఎన్ఏ (DNA) పరీక్షలపైనే ప్రధానంగా ఆధారపడ్డారు. టెర్రస్‌పై దొరికిన ఎముకల అవశేషాలు, బూడిద నిజంగా సాయికృష్ణవేనా కాదా అని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు న్యాయస్థానం అనుమతితో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుండి డీఎన్ఏ నమూనాలను సేకరించనున్నారు. వాటిని లభించిన అవశేషాలతో పోల్చి చూసి (DNA Matching), ఒకవేళ మ్యాచ్ అయితే సాయికృష్ణ మరణం ఇంకా శవాలహరణంపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు, ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు, సీఐ నాగరాజును విచారించేందుకు సిట్ వేసిన ప్లాన్ మొదటి రోజు వర్కవుట్ కాలేదు. ఈ విచారణను రాజమండ్రి జైలులో కాకుండా విజయవాడకు తరలించి విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిట్ ఉన్నతాధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో, మొదటిరోజు అధికారులు జైలుకు వెళ్లలేదు.
ఇదే సమయంలో సీఐ నాగరాజు జైలు అధికారుల ఈ-మెయిల్ ద్వారా కోర్టుకు ఒక వినతిపత్రం పంపడం కలకలం రేపింది. ఈ కేసులో తాను పూర్తి నిర్దోషినని, సిట్ అధికారులు తనను బలవంతంగా ఇరికించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అరెస్ట్ సమయంలోనే తాను అన్ని వివరాలు చెప్పానని, మళ్లీ తనను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ కోర్టు అనుమతితో విచారించాల్సి వస్తే, సిట్ ఆఫీసులో కాకుండా ఏదైనా తటస్థ ప్రదేశంలో, తన లాయర్ల సమక్షంలోనే విచారణ జరపాలని కోరారు. అలాగే విచారణ పేరిట తనపై ఎలాంటి చిత్రహింసలు జరగకుండా న్యాయస్థానం రక్షణ కల్పించాలని సీఐ నాగరాజు కోర్టును అభ్యర్థించారు.
