Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశంలో అల్పసంఖ్యాక వర్గాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా నర్సింగ్డి జిల్లాలో మణి చక్రవర్తి అనే కిరాణా వ్యాపారిని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. చార్‌సిందూర్ బజార్‌లోని తన దుకాణంలో పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో, గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడి పదునైన ఆయుధాలతో ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న మణిని స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. తోటి వ్యాపారుల కథనం ప్రకారం, మణి చక్రవర్తి ఎవరితోనూ గొడవలకు వెళ్లే వ్యక్తి కాదని, చాలా సౌమ్యుడని తెలుస్తోంది.
Also Read: Venezuela: వెనిజువెలా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు… దేశ రాజధానిలో ఉద్రిక్తత
ఈ ఘోరం జరగడానికి కేవలం కొన్ని గంటల ముందే జషోర్ జిల్లాలో రాణా ప్రతాప్ అనే యువకుడిని దుండగులు పట్టపగలే కాల్చి చంపడం గమనార్హం. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు హిందువులు ప్రాణాలు కోల్పోవడంతో బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందూ సమాజం తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత దేశంలో తలెత్తిన అల్లర్లు, ఉద్రిక్తతలు హిందువులపై దాడులకు ఆజ్యపోస్తున్నాయి. గత 19 రోజుల వ్యవధిలోనే మొత్తం ఆరుగురు హిందువులు దుండగుల చేతిలో హత్యకు గురవ్వడం అక్కడి క్లిష్ట పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఇప్పటివరకు జరిగిన వరుస హత్యలలో దీపు దాస్, అమృత్ మండల్, బజేంద్ర బిశ్వాస్, ఖోకోన్ దాస్, రాణా ప్రతాప్ తాజాగా మణి చక్రవర్తి ప్రాణాలు కోల్పోయారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లోనే ఇలాంటి హత్యలు జరుగుతుండటంతో సామాన్యులు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ దాడులకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని బాధితుల కుటుంబ సభ్యులతో పాటు స్థానిక హిందూ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
