Venezuela

Venezuela: వెనిజువెలా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు… దేశ రాజధానిలో ఉద్రిక్తత

Venezuela: వెనిజువెలా రాజకీయ సంక్షోభం ఒక్కసారిగా రక్తపాతానికి దారితీసింది. ఆ దేశ రాజధాని కారకాస్‌లో భయానక వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మడూరోను అమెరికా దళాలు నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేయడంతో వెనిజువెలా అట్టుడుకుతోంది. ముఖ్యంగా అధ్యక్ష భవనం ‘మిరాఫ్లోరెస్’ పరిసర ప్రాంతాల్లో భారీగా బాంబు పేలుళ్లు, తుపాకుల మోతలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం రాత్రి అధ్యక్ష భవనంపై గుర్తుతెలియని డ్రోన్లు సంచరించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై ఆ డ్రోన్లపై కాల్పులు జరిపి వాటిని నేలకూల్చాయి. ప్రస్తుతం పరిస్థితి తమ నియంత్రణలోనే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, రాజధాని నగరమంతా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నివురుగప్పిన నిప్పులా ఉంది.

Also Read: China: అమెరికా పై విరుచుకుపడ్డ చైనా

ఈ హింసాత్మక ఘటనలకు కొన్ని గంటల ముందే అమెరికా బలగాలు ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించి మడూరోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను కారకాస్‌లోని ఒక సైనిక స్థావరం నుంచి అదుపులోకి తీసుకున్నాయి. వారిని నేరుగా న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. మడూరోపై నార్కో-టెర్రరిజం (మాదకద్రవ్యాల ఉగ్రవాదం) కుట్రలో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలతో అమెరికా గతంలోనే కేసులు నమోదు చేసింది. కోర్టులో హాజరైన మడూరో తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను నిర్దోషినని, ఇప్పటికీ వెనిజువెలా అధ్యక్షుడిని తానేనని వాదించారు. అయితే కోర్టు తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. అమెరికా కోర్టు వెలుపల మడూరోకు మద్దతుగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో అక్కడ కూడా ఉద్రిక్తత నెలకొంది.

మడూరో అరెస్టు తర్వాత వెనిజువెలాలో కీలక రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగెస్ వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మడూరోకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. అదే సమయంలో మడూరో అత్యంత సన్నిహితుడు, జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగెస్ అమెరికా చర్యలపై నిప్పులు చెరిగారు. మడూరోను తిరిగి అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి ఏ మార్గాన్నైనా అనుసరిస్తామని, ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. ఈ ప్రకటనలతో వెనిజువెలాలో అంతర్గత యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు వెనిజువెలా వైపు ఆందోళనగా చూస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *