David Warner: ఆస్ట్రేలియా మాజీ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రింక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనం నడపడం) కేసులో చిక్కుకున్నారు. సిడ్నీలో మద్యం తాగి కారు నడిపినట్లు ఆయన కోర్టులో తన తప్పును అంగీకరించారు. దీంతో ఆయనకు జరిమానా, డ్రైవింగ్ నిషేధంతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
1. కేసు ఏంటి? అసలు ఏం జరిగింది?
సిడ్నీ తూర్పు ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన రాండమ్ బ్రీత్ టెస్ట్‌లో వార్నర్ పట్టుబడ్డారు. పరీక్షలో ఆయన రక్తంలో ఆల్కహాల్ శాతం చట్టపరమైన పరిమితి కంటే రెండింతలు ఎక్కువ (0.104) ఉన్నట్లు తేలింది. తాగి వాహనం నడిపినట్లు వార్నర్ తరఫు న్యాయవాది కోర్టులో అంగీకరించారు.
2. శిక్ష ఎప్పుడు? ఎంత పడే అవకాశం ఉంది?
కోర్టు వార్నర్‌కు ఆగస్టు 18న శిక్షను ఖరారు చేయనుంది. వార్నర్‌పై కనీసం 6 నెలల పాటు డ్రైవింగ్ నిషేధం పడే అవకాశం ఉంది. దీనితో పాటు 2,200 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా మరియు గరిష్టంగా 9 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.
3. కెప్టెన్సీ ఊడుతుందా?
వార్నర్ ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో ‘సిడ్నీ థండర్’ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. అయితే, ఈ జట్టు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి “డ్రింక్ అండ్ డ్రైవ్ వ్యతిరేక” ప్రచారంలో భాగస్వామిగా ఉంది. దీంతో ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది చాలా తీవ్రమైన విషయం. మద్యం తాగి వాహనం నడపడాన్ని మేము అస్సలు ప్రోత్సహించం అని క్రికెట్ ఎన్ఎస్డబ్ల్యూ సీఈఓ తెలిపారు. 2018 సాండ్‌పేపర్ బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత లభించిన కెప్టెన్సీ బాధ్యతలు ఇప్పుడు ఈ కొత్త వివాదంతో మళ్లీ ప్రమాదంలో పడ్డాయి.
