Sonam Wangchuk: నీట్ (NEET) ప్రవేశ పరీక్షలో జరిగిన అక్రమాలకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తనను కలిసిన కేంద్ర మంత్రులు దీక్ష విరమించాలని కోరారని, విద్యార్థుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
1. నష్టపరిహారం & విద్యాశాఖ మంత్రి రాజీనామా!
పేపర్ లీకేజీల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు విద్యా వ్యవస్థలో జవాబుదారీతనంపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయిలో చర్చ జరపాలని కోరారు. ఈ విషయాలపై కేంద్ర మంత్రులు తనకు సానుకూల హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
2. విద్యార్థులపై కేసులు పెట్టవద్దు!
జూలై 20న జరిగిన ‘సంసద్ చలో’ ర్యాలీలో పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు ఎంతో ఓపికతో, శాంతియుతంగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు మరియు యువతపై ఎలాంటి కేసులు పెట్టకూడదని, వారిని వేధించబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.సుమారు 65 మంది ఎంపీలు తనకు లేఖలు రాసి, స్వయంగా కలిసి దీక్ష విరమించాలని కోరారని తెలిపారు. తాను జీవించాలనుకుంటున్నానని, అయితే విద్యార్థుల భవిష్యత్తును పక్కనబెట్టి దీక్ష విరమించలేనని స్పష్టం చేశారు.
3. స్పష్టమైన హామీ లేకపోతే దీక్ష కొనసాగింపు!
ప్రభుత్వం తన విజ్ఞప్తులను, లక్షలాది మంది భారతీయ యువత ఆకాంక్షలను ఆలకించిందని భావిస్తేనే దీక్ష విరమిస్తానని.. లేకపోతే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తానని హెచ్చరించారు.ప్రశ్నించే యువతను ప్రభుత్వం ఎలా చూస్తుందనే దానిపైనే దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సోనమ్ వాంగ్‌చుక్ లేఖలో పేర్కొన్నారు.
