Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ యుద్ధంలో అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాలను రష్యా ఉపయోగిస్తున్నట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నెదర్లాండ్స్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ (AIVD) వెల్లడించిన ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది.
రష్యా ఉక్రెయిన్‌పై ఏకంగా 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో 23 మంది తీవ్రంగా గాయపడగా, కీవ్‌లోని పోలాండ్ దౌత్యకార్యాలయం కూడా ధ్వంసమైంది. ఈ దాడుల్లో రష్యా క్లోరోపిక్రిన్ అనే నిషేధిత రసాయన ఆయుధాన్ని వాడుతోందని నెదర్లాండ్స్ నిఘా సంస్థలు వెల్లడించాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ మొదట ఉపయోగించిన ఈ రసాయనం, సైనికులను ఉక్కిరిబిక్కిరి చేసి చంపగలదని డచ్ రక్షణ మంత్రి రూబెన్ బ్రేకల్‌మాన్స్ రాయిటర్స్‌కు తెలిపారు. ఈ ఆయుధాల వాడకానికి సంబంధించిన ఆధారాలను ది హేగ్, డచ్ నిఘా సంస్థలు సేకరించాయి.
రూబెన్ బ్రేకల్‌మాన్స్ ఆరోపణల ప్రకారం, ఈ రసాయన ఆయుధాల కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పటికే ముగ్గురు మరణించారు. ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ నివేదికలో 2,500 మంది వరకు గాయపడినట్లు తేలిందని ఆయన తెలిపారు. రష్యా ఈ రసాయన ఆయుధాలను విస్తృతంగా ఉపయోగించడం ఉక్రెయిన్‌తో పాటు ఇతర దేశాలకు కూడా హానికరం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాస్కోపై కఠిన ఆంక్షలు విధించాలని రూబెన్ పిలుపునిచ్చారు. ఈ తాజా నివేదికను డచ్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
Also Read: Donald Trump: ట్రంప్ ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ఆమోదముద్ర.. అమెరికా ఆర్థిక విధానంలో కొత్త శకం
గతేడాది అమెరికా కూడా ఉక్రెయిన్‌పై రష్యా క్లోరోపిక్రిన్ వాడుతోందని ఆరోపించగా, మాస్కో అప్పుడు ఖండించింది. తాజాగా వెలువడిన నివేదికలపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, తాము ఎలాంటి రసాయన ఆయుధాలు ఉపయోగించడం లేదని, బదులుగా ఉక్రెయినే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఎదురు ఆరోపించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు తూర్పున క్లోరోపిక్రిన్ కలిగిన పేలుడు పరికరాల నిల్వలను తమ ఫెడరల్ సెక్యూరిటీ అధికారులు కనుగొన్నారని తెలిపారు. అయితే, ఈ రసాయన వాడకం కోసం రష్యా ఏజెంట్లను ఉపయోగిస్తున్నారని, ఈ ఆయుధాలపై భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కొత్త శాస్త్రవేత్తలను కూడా నియమిస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆరోపణలు, ప్రతి ఆరోపణల నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.