Romanchakam Movie Review

Romanchakam Movie Review: వంగా సమర్పణలో వచ్చిన యూత్ కామెడీ.. నవ్వులు పూయించిందా? లేక బోరింగా మారిందా?

Romanchakam Movie Review: ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సంచలన సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరించడంతో ‘రొమాంచకం’ సినిమాపై యూత్‌లో మంచి హైప్ ఏర్పడింది. ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ రోమ్‌-కామ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
కథేంటంటే?
హైదరాబాద్‌కు చెందిన అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఎలాంటి బాధ్యతలు లేకుండా స్నేహితులతో జులాయిగా తిరుగుతుంటాడు. సొంతంగా డేటింగ్ యాప్ స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనతో, అమ్మాయిల సైకాలజీని అర్థం చేసుకునేందుకు తానే స్వయంగా ఓ డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు. అలా చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక) అతనికి పరిచయమవుతుంది. పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.
అన్వేష్‌ను కలిసేందుకు మైథిలి హైదరాబాద్ వస్తుంది. తానేదో పెద్ద బిజినెస్‌మెన్‌నని, భారీ ఫ్లాట్ ఉందని ఆమెకు అబద్ధం చెప్పి ఫ్రెండ్ ఫ్లాట్‌లో ఉంచుతాడు. అయితే ఊహించని విధంగా మైథిలి అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. ఆమె ఆత్మహత్య చేసుకుందేమోనని అన్వేష్, అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ భయపడతారు. ఆ తర్వాత వీరి జీవితాల్లోకి ఎస్సై నంజుండప్ప (ఉపేంద్ర లిమాయే) ఎలా ప్రవేశించాడు? ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మైథిలి ఏమైంది? అన్నదే మిగతా కథ.
ఎవరెలా చేశారంటే?
  • సుమంత్ ప్రభాస్: జులాయిగా తిరిగే పాత్రలో సుమంత్ ప్రభాస్ సహజసిద్ధమైన నటన కనబరిచాడు. పొడవాటి డైలాగ్ డెలివరీలోనూ తడబడకుండా కామెడీని బాగా పండించాడు.
  • నరేంద్ర రవి (షో స్టీలర్): ఈ సినిమాకు అసలైన సేవియర్ నరేంద్ర రవి. చింటూ పాత్రలో అతడి కామెడీ టైమింగ్, వన్ లైనర్లు థియేటర్‌లో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి.
  • ఉపేంద్ర లిమాయే & ఫ్రెండ్స్ గ్యాంగ్: పోలీస్ ఆఫీసర్‌గా ఉపేంద్ర లిమాయే తనదైన మార్క్ బాడీ లాంగ్వేజ్‌తో నవ్వించినా, కొన్నిచోట్ల లౌడ్‌గా అనిపిస్తుంది. మిగతా ఫ్రెండ్స్ మణి ఎగుర్ల, వెంకటేష్ కాకుమాను చక్కటి సహకారం అందించారు. క్లైమాక్స్‌లో డైరెక్టర్ కేవీ అనుదీప్ గెస్ట్ రోల్ నవ్వులు పూయిస్తుంది.
  • అనంతిక సనీల్ కుమార్: తమిళ అమ్మాయిగా చూడటానికి బాగుంది, కళ్లతోనే హావభావాలు పలికించింది. అయితే ఆమె పాత్ర చిత్రణ బలహీనంగా ఉండటంతో నటనకు పెద్దగా స్కోప్ దక్కలేదు.

సాంకేతిక విభాగం..

వాసుకి వైభవ్ అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం రొమాంటిక్ సన్నివేశాలకు తగ్గట్టుగా కుదిరింది. పవన్ కుమార్ సినిమాటోగ్రఫీ స్క్రీన్‌ను చాలా కలర్‌ఫుల్‌గా, ఆహ్లాదకరంగా చూపించింది. అయితే ఎడిటింగ్ విభాగం ప్రథమార్ధంలో మరింత కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా నీట్‌గా ఉన్నాయి.
బలాలు & బలహీనతలు..
  • ప్లస్ పాయింట్స్:
    • నరేంద్ర రవి కామెడీ టైమింగ్, ఫ్రెండ్స్ మధ్య సంభాషణలు
    • ప్రీ-ఇంటర్వెల్, పోలీస్ స్టేషన్ సీన్లలో పండిన హిలేరియస్ ఫన్
    • ఫ్రెష్‌గా అనిపించే పాటలు, విజువల్స్
  • మైనస్ పాయింట్స్:
    • లాజిక్ లేని సన్నివేశాలతో సాగే ఫస్టాఫ్
    • ఎమోషన్, డెప్త్ లోపించిన రొమాంటిక్ ట్రాక్
    • హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌లో గందరగోళం
    • సందర్భోచితం కాకుండా ఇరికించిన కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు

విశ్లేషణ..

దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి యూత్‌ను ఆకట్టుకునేలా బడ్డీ కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాలను మిక్స్ చేయడానికి ప్రయత్నించారు. అయితే లవ్ స్టోరీని, థ్రిల్ అంశాలను సీరియస్‌గా నడపడంలో తడబడ్డారు. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. కానీ ఆ లోపాలను కవర్ చేసేలా సెకండాఫ్‌లో స్నేహితుల మధ్య వచ్చే కామెడీ బ్లాక్స్‌ను పకడ్బందీగా రాసుకున్నారు. ‘జాతిరత్నాలు’, ‘ఈ నగరానికి ఏమైంది’ తరహా కామెడీని ఆస్వాదించే యూత్‌కు ఈసినిమాలోని జోకులు నచ్చుతాయి.
లాజిక్కులు పక్కనపెట్టి, కేవలం సరదా వన్ లైనర్లు, బడ్డీ కామెడీని మాత్రమే ఎంజాయ్ చేయాలనుకుంటే ‘రొమాంచకం’ ఒకసారి సరదాగా చూడదగ్గ టైమ్‌పాస్ మూవీ.
  • బాటమ్ లైన్: కామెడీ పేలింది.. రొమాన్స్ మిస్సయ్యింది!
  • రేటింగ్: 2.5 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *