IRCTC

IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ధరకే గోదావరి టెంపుల్ టూర్..!

IRCTC: గోదావరి జిల్లాల్లోని మహిమాన్విత పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ఆధ్యాత్మిక ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యేలా ‘గోదావరి టెంపుల్ టూర్’ (Godavari Temple Tour) పేరుతో 3 రాత్రులు, 4 రోజుల వీకెండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని సాగే ఈ యాత్రలో అన్నవరం సత్యనారాయణ స్వామి, అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి, ద్రాక్షారామం భీమేశ్వరుడితో పాటు కోనసీమలోని పలు ప్రముఖ ఆలయాలను ఒక్కరికి రూ. 5,120 ప్రారంభ ధరతోనే సులభంగా దర్శించుకోవచ్చు.

గోదావరి యాత్ర సాగుతుందిలా.. (ఐటీనరీ)
  • డే 1 (శుక్రవారం): రాత్రి 8:30 గంటలకు లింగంపల్లిలో, రాత్రి 9:15 గంటలకు సికింద్రాబాద్‌లో గౌతమి ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12738) ఎక్కడంతో ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా రైలులోనే ప్రయాణం.
  • డే 2 (శనివారం): తెల్లవారుజామున 4:38 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. హోటల్‌లో ఫ్రెషప్ అయ్యాక, రత్నగిరిపై వెలసిన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తారు. దర్శనం తర్వాత సాయంత్రానికి రాజమండ్రి చేరుకుని గోదావరి ఘాట్, ప్రసిద్ధ ఇస్కాన్ (ISKCON) ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి రాజమండ్రి హోటల్‌లోనే బస.
  • డే 3 (ఆదివారం): ఉదయం హోటల్ చెకౌట్ చేసి సముద్ర సంగమ క్షేత్రమైన అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, బీచ్‌ను సందర్శిస్తారు. అనంతరం అప్పనపల్లి బాల బాలాజీ ఆలయం, అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయం, పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి 8:18 గంటలకు రాజమండ్రిలో గౌతమి ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12737) ఎక్కడంతో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
  • డే 4 (సోమవారం): తెల్లవారుజామున 4:35 గంటలకు సికింద్రాబాద్, ఉదయం 5:55 గంటలకు లింగంపల్లి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
టికెట్ ధరలు – వసతి వివరాలు..
ఈ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ (స్టాండర్డ్), 3-టైర్ ఏసీ (కంఫర్ట్) కేటగిరీలు ఉన్నాయి.
  • 1 నుంచి 3 ప్రయాణికుల గ్రూప్‌లో: స్లీపర్ ట్రిపుల్ షేరింగ్ ఒక్కొక్కరికి రూ. 5,670 కాగా, 3AC ట్రిపుల్ షేరింగ్ రూ. 7,230.
  • 4 నుంచి 6 ప్రయాణికుల గ్రూప్‌లో: స్లీపర్ ట్రిపుల్ షేరింగ్ ఒక్కొక్కరికి రూ. 5,120 కాగా, 3AC ట్రిపుల్ షేరింగ్ రూ. 6,680.
    ఈ ప్యాకేజీలో రైలు టికెట్లు, రాజమండ్రిలో హోటల్ వసతి, లోకల్ సైట్‌సీయింగ్ కోసం ఏసీ వాహనం, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్ ఛార్జీలు కలిసి ఉంటాయి. అయితే రోజువారీ భోజనం, ఆలయాల్లో ప్రత్యేక దర్శన టికెట్లు, వ్యక్తిగత ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
బుకింగ్ ఎలా చేసుకోవాలి?
ఈ టూర్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఉద్యోగులు, విద్యార్థులు పెద్దగా సెలవులు పెట్టాల్సిన అవసరం లేకుండా వీకెండ్‌లోనే యాత్ర పూర్తయ్యేలా దీన్ని డిజైన్ చేశారు. ఆసక్తి ఉన్నవారు IRCTC అధికారిక వెబ్‌సైట్ (www.irctctourism.com) ద్వారా లేదా సికింద్రాబాద్‌లోని ఆక్స్‌ఫర్డ్ ప్లాజా కార్యాలయంలో (ఫోన్ నంబర్లు: 8287932229, 8287932228, 9701360701) సంప్రదించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
గోదావరి తీరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కోనసీమ అందాలను వీకెండ్‌లో అతి తక్కువ ఖర్చుతో చూసి రావాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ ‘గోదావరి టెంపుల్ టూర్’ ఒక బెస్ట్ ఆప్షన్. రైలు జర్నీ, హోటల్ రూమ్, లోకల్ క్యాబ్ అన్నీ ఒకే ప్యాకేజీలో కవర్ అవుతుండటంతో కుటుంబంతో సహా ప్రయాణించడానికి ఇది చక్కగా సరిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *