Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ‘ఇందిరమ్మ రాజ్యం’ అందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో మాట్లాడుతూ, విర్రవీగిన బీఆర్ఎస్‌ను మూడు రంగుల జెండాతో దెబ్బకొట్టామని, 4 కోట్ల మంది ప్రజలను చైతన్యపరిచామని సీఎం అన్నారు. ఇక్కడే ఇందిరమ్మ రాజ్యానికి పునాది పడిందని ఆయన గుర్తు చేశారు.
ప్రతిపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ సమాధానం:
తమ ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటే అని, సంక్షేమ పథకాలు ఎక్కువ రోజులు అమలు చేయరని, కాంగ్రెస్ వాళ్లు కలిసి ఉండరని, కొట్టుకుంటారని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే, కాంగ్రెస్ నాయకులంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఆ అపోహలన్నింటినీ పటాపంచలు చేశామని ఆయన స్పష్టం చేశారు. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
కులగణన, రైతు భరోసాపై ఘన విజయం:
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కులగణన చేసి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా పథకం విఫలమవుతుందని కొందరు “గొతికాడ నక్కల్లా” ఎదురుచూశారని, కానీ 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన గర్వంగా చెప్పారు. రైతు రాజ్యం ఎవరిదో పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, మోదీ, కేసీఆర్, కిషన్‌రెడ్డి – ఎవరైనా చర్చకు రావచ్చని సవాల్ విసిరారు. 18 నెలల్లో రైతుల కోసం రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు చేశామని, 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు.
Also Read: Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే: హైదరాబాద్‌కు మోదీ చేసినదేమీ లేదు
ఉద్యోగాల కల్పన, ఇందిరమ్మ ఇళ్లు:
గతంలో ఉద్యోగాలు అడిగితే గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకోమన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, తాము వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ 60 వేల మందిని నిలబెట్టి లెక్క చెబుతానని, ఒక్కటి తప్పినా వారి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతానని ఆయన సవాల్ విసిరారు. పేదలకు సొంత ఇళ్లు, సొంత భూమి ఉందంటే అది ఇందిరమ్మ ఇచ్చిందేనని, పథకాలకు ఇందిరమ్మ పేరుపెడితే కొందరు రాద్ధాంతం చేస్తున్నారని, అలాంటి వారికి బుద్ధి చెబితే కానీ ఇందిరమ్మ గొప్పతనం తెలియదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నామని స్పష్టం చేశారు.
పార్టీ కార్యకర్తలదే విజయం, భవిష్యత్ ప్రణాళికలు:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కారణమని మరోసారి నొక్కిచెప్పిన సీఎం, స్థానిక సంస్థల్లో కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత తనదేనని, వారికి అన్ని పదవులు దక్కే వరకు విశ్రమించనని హామీ ఇచ్చారు. తాము చేసిన పనులను ప్రచారం చేసుకోవడం లేదని, వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించి, ఈ యుద్ధంలో “కల్వకుంట్ల గడీ తునాతునకలు కావాలి” అని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని, దానికంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యతని ధీమా వ్యక్తం చేశారు.