Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం పార్టీ కార్యకర్తలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఐక్యంగా కృషి చేసి భారత రాష్ట్ర సమితిని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఖర్గే అన్నారు.
తెలంగాణలో అభివృద్ధి పథకాల ప్రస్తావన:
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ఖర్గే పేర్కొన్నారు. గతంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని, రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.8,200 కోట్లు జమ చేసిందని గుర్తు చేశారు. పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, గత ప్రభుత్వం అమ్మే బియ్యం ఇచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తినే బియ్యం ఇస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్, ఫ్రీ బస్సు, సన్నబియ్యం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని, ‘తెలంగాణ మోడల్’ దేశమంతా అనుసరిస్తోందని ఖర్గే ప్రశంసించారు.
మోదీ ప్రభుత్వంపై ఖర్గే తీవ్ర విమర్శలు:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ రూ.15 లక్షలు ఇచ్చారా, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేస్తూ, 11 ఏళ్లలో తెలంగాణకు మోదీ ఏం చేశారని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అడ్డుకోవడానికి కేసీఆర్, బీజేపీ ప్రయత్నించినా ప్రజలు వారిని ఓడించారని ఖర్గే అన్నారు. “వారు అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతారు.. మేము పని చేసి ఓట్లు అడుగుతాం” అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Indian Army: ఒకే సరిహద్దు.. ముగ్గురు ప్రత్యర్థులు: ఆపరేషన్ సిందూర్ పాఠాలపై ఆర్మీ కీలక వ్యాఖ్యలు!
జాతీయ అంశాలపై మోదీ మౌనం:
మణిపూర్ తగలబడితే మోదీ మౌనంగా ఉన్నారని, మణిపూర్ వాసులు ఈ దేశ ప్రజలు కాదా అని ఖర్గే ప్రశ్నించారు. తాను, రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్లినా మోదీ మాత్రం వెళ్లలేదని విమర్శించారు. పహల్గాం ఘటన జరిగినప్పుడు తామంతా కేంద్రానికి మద్దతు ఇచ్చామని, అయితే ఆల్ పార్టీ మీటింగ్‌కు మోదీ హాజరుకాకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఖర్గే మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని ఆరోపించారు.
కులగణన, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నిబద్ధత:
దేశంలో తొలిసారి కులగణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని ఖర్గే అన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యేదాకా కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. “మోదీది ‘మన్ కీ బాత్’ అయితే, కాంగ్రెస్ ‘దిల్ కీ బాత్'” అని ఆయన వ్యాఖ్యానించారు. సిగాచి ప్రమాద మృతులకు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గిగ్ వర్కర్ల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తోందని ఆయన ప్రకటించారు.